Ramdas Athawale: మహారాష్ట్రలో దారుణ పరిస్థితులు.. రాష్ట్రపతి పాలన విధించండి: అమిత్ షాకు అథవాలే లేఖ
- రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి
- ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోయిందన్న అథవాలే
- ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలంటూ లోక్‌సభలో బీజేపీ ఎంపీల డిమాండ్
మహారాష్ట్రలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని, అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రమంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్ రామ్‌దాస్ అథవాలే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయారని, కాబట్టి అక్కడి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని రిపబ్లికన్ పార్టీ డిమాండ్ చేస్తోందని అథవాలే ఆ లేఖలో పేర్కొన్నారు. బీజేపీ ఎంపీలు లోక్‌సభలో ఇలాంటి డిమాండ్ చేసిన కొన్ని గంటలకే అథవాలే లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణలను లోక్‌సభ జీరో అవర్‌లో బీజేపీ సభ్యుడు మనోజ్ కోటక్ లేవనెత్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం తన అధికారులను డబ్బుల వసూళ్ల కోసం వినియోగిస్తోందని ఆరోపించారు. తనకు అందిన లేఖపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఇప్పటి వరకు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదన్నారు.
ఇది చాలా తీవ్రమైన అంశమని, హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా రాజీనామా చేయాలని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని మనోజ్ కోటక్ డిమాండ్ చేశారు.