Telangana: పాఠశాలలు మూసేస్తేనే బెటర్: సీఎం కేసీఆర్‌కు వైద్యశాఖ ప్రతిపాదన
- ఒకటి రెండు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం
- రాష్ట్రవ్యాప్తంగా 700 మంది విద్యార్థులకు పాజిటివ్
- పిల్లలు వాహకాలుగా మారుతున్నారన్న వైద్యాధికారులు
- రాష్ట్రంలో రోజుకు 300కు పైగా కేసుల నమోదుతో ఆందోళన
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుండడంతో వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. పరిస్థితి చేజారిపోకుండా ఉండాలంటే పదో తరగతి లోపు పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లను మూసివేయడం మంచిదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. వైరస్ వ్యాప్తికి ఇవి వాహకాలుగా మారుతున్నాయని భావిస్తున్న వైద్యాధికారులు ఈ సూచన చేశారు. వైద్యశాఖ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న వెంటనే ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం ఈ విషయంలో ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 700 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. నిజానికి పిల్లల్లో రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉండడంతో వారికి వైరస్ సంక్రమించినా లక్షణాలు బయటపడవు. దీంతో వారి నుంచి కుటుంబ సభ్యులకు, వారి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తోందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలల మూసివేతే సరైన పరిష్కారమని చెబుతున్నారు.
మరోవైపు, రాష్ట్రంలో మళ్లీ రోజుకు 300కు పైగా కేసులు నమోదవుతుండం ఆందోళన కలిగిస్తోంది. ఇది ఏ రకమైన స్ట్రెయినో తెలుసుకునేందుకు అధికారులు పరీక్షలు చేస్తున్నారు.