Gantinapati Mohan Rao: 'ఖాకీ బతుకులు' నవలతో సంచలనం సృష్టించిన రచయిత గంటినపాటి కన్నుమూత

Kakhi Bathukulu Novel writer Gantinapati dead

  • పోలీసు వ్యవస్థలోని మరో కోణాన్ని వెలుగులోకి తెచ్చిన నవల 
  • అధికారుల ఆగ్రహంతో ఉద్యోగం కోల్పోయిన వైనం
  • కోర్టు ఆదేశాలతో మళ్లీ ఉద్యోగాన్ని తెచ్చుకున్న గంటినపాటి

పోలీసు వ్యవస్థలోని మరో కోణాన్ని 'ఖాకీ బతుకులు' నవల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చి... పోలీస్ శాఖలో సంచలనం రేపిన విశ్రాంత హెడ్ కానిస్టేబుల్ గంటినపాటి మోహనరావు కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. గుంటూరు జిల్లా తెనాలి పోలీస్ క్వార్టర్స్ లోని నివాసంలో ఆయన కన్నుమూశారు.

తెనాలిలో పని చేస్తున్నప్పుడు 1980-83 మధ్య కాలంలో ఆయన ఈ నవల రాశారు. పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా పని చేసిన తండ్రి ప్రకాశరావు జీవితానుభవాలతో ఆయన ఈ నవలను రాశారు. 1996లో ఇది పుస్తకరూపం దాల్చింది. 'స్పార్టకస్' అనే కలం పేరుతో ఆయన ఈ నవలను రచించారు.

'ఖాకీ బతుకులు' నవల అప్పట్లో కలకలం రేపింది. పోలీసు బాసులు ఆయనపై కన్నెర్ర చేశారు. ఈ క్రమంలో ఆయన ఉద్యోగాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. తన ఉద్యోగం కోసం ఆయన న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. అయితే, ఆయన తరపున కేసును వాదించిన న్యాయవాదులపై కూడా ఆయన నమ్మకం కోల్పోయారు. ఆ తర్వాత ఆయన తన కేసును తానే వాదించుకున్నారు. తన ఉద్యోగం కోసం ఆయన 13 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేశారు. చివరకు పోరాటం ఫలించి 2011లో మళ్లీ ఉద్యోగాన్ని సాధించారు. ఆ తర్వాత కేవలం 10 నెలల పాటు హెడ్ కానిస్టేబుల్ గా పని చేసి రిటైర్ అయ్యారు.

ఉద్యోగం వచ్చినప్పటికీ... సస్పెన్షన్ లో ఉన్న పదవీకాలాన్ని సర్వీసు రికార్డుల్లో చేర్చలేదు. ఆ కాలంలో రావాల్సిన సగం వేతనాన్ని చెల్లించడానికి నిరాకరించారు. దీంతో, ఆయన మళ్లీ కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారించిన కోర్టు 13 ఏళ్ల పెన్షనరీ ప్రయోజనాలను మోహన్ రావుకు కల్పించాలని తీర్పును వెలువరించింది.

అయితే, దీనిపై అప్పటి జిల్లా ఎస్పీ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. 13 ఏళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకోకుండానే పెన్షన్ సెటిల్ చేశారు. 'ఖాకీ బతుకులు' రెండో భాగం రాస్తానని గతంలో మోహన్ రావు ప్రకటించినప్పటికీ... అనారోగ్యం కారణంగా అది వాస్తవరూపం దాల్చలేదు. ఆయనకు భార్య మేరీ, కుమార్తె ప్రత్యూష, కుమారుడు ప్రేమ్ చంద్ ఉన్నారు. ఆయన మృతి పట్ల సాహితీలోకం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News