Zomato: బెంగళూరు జొమాటో వివాదం.. ఇంకా కొలిక్కిరాని కేసు!
- జొమాటో డెలివరీ బాయ్, యువతి మధ్య వివాదం
- డెలివరీ బాయ్ తనపై దాడి చేశాడన్న యువతి
- కొడుతుండడంతో చేయి అడ్డుపెట్టానన్న డెలివరీ బాయ్
- ఉంగరం చీరుకుని గాయమైందని వెల్లడి
ఇటీవల బెంగళూరులో జొమాటో డెలివరీ బాయ్, హితేష చంద్రాణి అనే యువతి మధ్య చెలరేగిన వివాదం కేసు దర్యాప్తును పోలీసులు ప్రస్తుతానికి నిలిపివేశారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోవడం, కేవలం ఆ యువతి చెప్పే అంశాలను పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకునే అవకాశం లేకపోవడంతో బెంగళూరు పోలీసులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
సాక్ష్యాధారాల కోసం తాము తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే ఆ యువతిని విచారించేందుకు ప్రయత్నిస్తే ఆమె అందుబాటులో లేకుండా పోయిందని పోలీసులు వెల్లడించారు. డెలివరీ ఇవ్వడానికి వచ్చిన బాయ్ ను ఎందుకు ఆలస్యమైందని అడిగినందుకు తనపై దాడి చేశాడని హితేష చంద్రాణి ఆరోపించడంతో ఈ వివాదం మొదలైంది.
అయితే తాను దాడి చేయలేదని, హితేష తనను చెప్పుతో కొడుతుండడంతో చేయి అడ్డుపెట్టానని, ఉంగరం చీరుకుని గాయమైందని జొమాటో డెలివరీ బాయ్ స్పష్టం చేశాడు. అయితే ఘటన స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు.
దీనిపై పోలీసు అధికారులు స్పందిస్తూ... విచారణకు రమ్మని పిలిస్తే... తన ఆంటీని చూసేందుకు మహారాష్ట్ర వెళుతున్నట్టు హితేష బదులిచ్చిందని తెలిపారు. ఆమె బంధువులు మాత్రం హితేష అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఆమె ఎక్కడుందో తెలుసుకుంటామని అన్నారు. ఆమె ముక్కుకు గాయం ఎలా అయిందో నివేదిక వచ్చిన తర్వాత తదుపరి దర్యాప్తు ఉంటుందని వివరించారు.