Rhinovirus: కరోనాను కట్టడి చేస్తున్న జలుబు కారక రైనో వైరస్!
- బ్రిటన్ లోని గ్లాస్గో వర్సిటీ పరిశోధకుల అధ్యయనం
- శ్వాసకోశ కణాలపై రైనో వైరస్, కరోనా వైరస్ లతో ప్రయోగం
- రైనో వైరస్ కణాలకు తలొగ్గిన కరోనా
- అయితే ఈ ఇమ్యూనిటీ తాత్కాలికమేనన్న పరిశోధకులు
బ్రిటన్ కు చెందిన గ్లాస్గో యూనివర్సిటీ పరిశోధకులు ఆశ్చర్యం కలిగించే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. సాధారణంగా మానవుల్లో జలుబుకు కారణమయ్యే రైనో వైరస్ కరోనా మహమ్మారితో సమర్థంగా పోరాడడమే కాకుండా, పైచేయి కూడా సాధిస్తుందని గ్లాస్గో పరిశోధకులు వెల్లడించారు. మానవుల్లో కలిగే జలుబుకు 40 శాతం ఈ రైనో వైరస్సే కారణం.
రైనో వైరస్ ఇతర వైరస్ ల తరహాలో కాకుండా మానవదేహంలో సొంతంగా మనుగడ సాగించేందుకు ప్రయత్నిస్తుంది. కొన్ని వైరస్ లు మానవదేహంలోకి ప్రవేశించాక ఇతర వైరస్ లతో పాటు మనుగడ సాగించేందుకు ప్రయత్నిస్తుంటాయి.
ఈ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకున్న గ్లాస్గో వర్సిటీ పరిశోధకులు మానవ శ్వాసకోశ వ్యవస్థ ప్రతిరూపాన్ని రూపొందించి, అందులోకి రైనో వైరస్, కరోనా వైరస్ లను ప్రవేశపెట్టారు. అయితే, రైనో వైరస్ ను ఎదురొడ్డి నిలవడంలో కరోనా వైరస్ కణాలు విఫలమవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.
కరోనా కణాలను ఎదుర్కొనే క్రమంలో రైనో వైరస్ మానవ రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తున్నట్టు తెలుసుకున్నారు. ఈ ప్రతిస్పందన వల్ల ఏర్పడే ఇమ్యూనిటీ కరోనా వైరస్ ను కట్టడి చేస్తున్నట్టు వెల్లడైంది. అయితే రైనో వైరస్ కారణంగా ఏర్పడిన ఈ ఇమ్యూనిటీ తాత్కాలికమేనట. రైనోవైరస్ కారణంగా ఏర్పడిన జలుబు తగ్గిన కొన్నిరోజులకే ఆ ఇమ్యూనిటీ కూడా అంతరించిపోతుందట.
గతంలో స్వైన్ ఫ్లూ ఉద్ధృతి తగ్గడంలోనూ రైనో వైరస్ పాత్ర ఉందని అధ్యయనాలు వచ్చాయి. తాజా పరిశోధనలో ఆ అధ్యయనాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.