USA: బైడెన్ అధ్యక్షుడయ్యాక... తొలిసారిగా క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా!

North Korea Test Fires Missiles

  • ఇటీవల జపాన్, దక్షిణ కొరియాల్లో అమెరికా మంత్రుల పర్యటన
  • ఆపై రోజుల వ్యవధిలోనే క్షిపణుల ప్రయోగం
  • తేలిగ్గా తీసిపారేసిన అమెరికా

అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికైన తరువాత తొలిసారిగా ఉత్తర కొరియా పలు క్షిపణులను పరీక్షించి చూడటం కలకలం రేపింది. శాంతిని కోరుతూ యూఎస్ రక్షణ, ద్వైపాక్షిక అధికారులు పర్యటించేందుకు వచ్చిన రోజుల వ్యవధిలోనే అమెరికాకు సవాల్ ను విసురుతూ కిమ్ జాంగ్ ఉన్ నేతృత్వంలో ఈ పరీక్షలు జరగడం గమనార్హం.

అయితే, అమెరికా మాత్రం ఈ పరీక్షలను తేలిగ్గానే తీసుకుంది. ఈ తరహా పరీక్షలు చాలా సర్వసాధారణమని, ఉత్తర కొరియాను అణ్వస్త్ర రహితంగా మార్చేందుకు తమ కృషి కొనసాగుతూనే ఉంటుందని అమెరికాకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు.

కాగా, ఆదివారం నాడు రెండు మిసైల్స్ ను నార్త్ కొరియా అధికారులు పరిశీలించినట్టు తెలుస్తోంది. ఇవి రెండూ స్వల్ప దూరంలో ఉండే లక్ష్యాలను ఛేదించేవేనని, సీమాంతర క్షిపణులు కాదని, యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ నిబంధనల పరిధిలోకి రావని అమెరికా అధికారులు వెల్లడించడం గమనార్హం. అమెరికా ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే ఉద్దేశం మాత్రం ఉండివుండవచ్చని వారు అభిప్రాయపడ్డారు.

ఇదిలావుండగా, యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ లు జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించి, ఈ రీజియన్ లో శాంతి స్థాపనకు తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఈ నెల 8న ప్రారంభమైన వీరి పర్యటన 18 రోజుల పాటు కొనసాగింది. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కిమ్ జాంగ్ ఉన్ తో సింగపూర్ లో ఓ మారు, వియత్నాంలో మరోమారు చర్చలు జరిపారు. ఈ చర్చల తరువాత కూడా ఉత్తర కొరియా తన క్షిపణి పరీక్షలకు విరామం పలకలేదు.

  • Loading...

More Telugu News