Teenmaar Mallanna: రేవంత్, వైయస్ షర్మిల డబ్బులు నాకెందుకు?: తీన్మార్ మల్లన్న

Why do I need Revanth Reddy and YS Sharmilas money says Teenmaar Mallanna

  • ఈటలకు అన్యాయం జరుగుతోందని గతంలోనే చెప్పాను
  • కేసీఆర్ పై నాకు ద్వేషం లేదు
  • సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను ఓడించండి

ఇటీవల జరిగిన తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న సత్తా చాటిన సంగతి తెలిసిందే. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు. తాజాగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీలో మంత్రి ఈటల రాజేందర్ కు అన్యాయం జరుగుతోందనే విషయాన్ని తాను గతంలోనే చెప్పానని అన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనకు లక్ష ఓట్లు వేయించారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని... బీజేపీ అభ్యర్థికి ఆయన ఆ ఓట్లు ఎందుకు వేయించలేకపోయారని ప్రశ్నించారు. సంజయ్ ది, తనది ఒకే కులమైతే ఏమిటని అన్నారు. మా ఇద్దరి సిద్ధాంతాలు వేరని చెప్పారు. తనపై కుల ముద్ర వేసే ప్రయత్నం చేయవద్దని అన్నారు.

తాను బీజేపీ సహా ఏ పార్టీలో చేరబోనని తీన్మార్ మల్లన్న చెప్పారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ను ఓడించాలని అక్కడి ఓటర్లను కోరుతున్నానని తెలిపారు. 45 కేజీల బరువుండే ముఖ్యమంత్రి కేసీఆర్ పై తనకు ద్వేషం లేదని... అయితే, ఆయన నిర్ణయాలను మాత్రం వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, వైయస్ షర్మిల డబ్బులు తనకెందుకని ప్రశ్నించారు. ఓట్లు, నోట్లను తనకు ప్రజలే ఇచ్చారని చెప్పారు. తన అనుచరులు ఒక్క రోజు టీ తాగకుంటే రూ. 5 కోట్లు జమ అవుతాయని అన్నారు.

కొత్త పార్టీని రిజిస్ట్రేషన్ చేయించాననే ప్రచారంలో నిజం లేదని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 6 వేల కిలోమీటర్ల పాదయాత్రకు ప్రణాళిక సిద్ధమైందని... త్వరలోనే పాదయాత్రను చేపడతానని తెలిపారు. అసెంబ్లీ అంటే ఏమిటో తెలియని వాళ్ల చేత  కూడా శాసనసభలో అడుగు పెట్టిస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News