West Bengal: మమత ట్రిపుల్ ధమాకా.. పశ్చిమ బెంగాల్ కిరీటం ‘దీదీ’కే: తేల్చేసిన టైమ్స్ నౌ- సీ ఓటర్ ఒపీనియన్  పోల్స్

TMC likely to get 160 seats in westbengal Times Now C Voter Survey

  • మమతకు బీజేపీ గట్టి పోటీ ఇస్తుందన్న సర్వే
  • సీఎన్ఎక్స్ సర్వే కూడా బెంగాల్ మమతదేనని స్పష్టీకరణ
  • బీజేపీకి పట్టం కట్టిన పీపుల్స్ పల్స్ సర్వే

త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ మళ్లీ విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం ఖాయమని మరో సర్వే స్పష్టం చేసింది. టైమ్స్ నౌ-సీ ఓటర్ నిర్వహించిన తాజా ఒపీనియన్ పోల్‌లో మమత ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తారని తేలింది. అయితే, ఆ విజయం ఏమీ ఆమెకు అంత ఆషామాషీగా దక్కబోదని, బీజేపీ నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతుందని పేర్కొంది. ఐదు రాష్ట్రాలకు  జరగనున్న ఎన్నికల్లో అసోం, పుదుచ్చేరిలో మాత్రం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడైంది.

తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి పరాభవం తప్పదని, స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే అధికారంలోకి వస్తుందని సర్వే పేర్కొంది. ఇక, కేరళలో మళ్లీ వామపక్ష కూటమికే అధికారం దక్కుతుందని తేల్చింది.

టైమ్స్ నౌ- సీ ఓటర్ సర్వే ప్రకారం.. బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా తృణమూల్ కాంగ్రెస్‌కు 152 నుంచి 168 మధ్య సీట్లు వస్తాయని, బీజేపీకి 104 నుంచి 120 మధ్య సీట్లు వస్తాయని ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. వామపక్షాలు-కాంగ్రెస్-ఐఎస్ఎఫ్ కూటమి 18 నుంచి 26 స్థానాలకే పరిమితం అవుతుంది.

అసోంలో మొత్తం స్థానాలు 126 కాగా, ఎన్డీయే కూటమికి 65-73, మహాజోత్‌కు 52-60, ఇతరులకు 0-4 మధ్య స్థానాలు వస్తాయి.

తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకే-కాంగ్రెస్-మిత్రపక్షాలకు 173-181 స్థానాలు, అన్నాడీఎంకే-బీజేపీ-మిత్రపక్షాలకు 45-53, ఎంఎన్ఎంకు 1-5, ఇతరులకు 0-4 సీట్లు వస్తాయని అంచనా.

కేరళలో 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వామపక్ష కూటమి ఎల్‌డీఎఫ్ 77 స్థానాలతో అధికారాన్ని నిలబెట్టుకుంటుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు 62 స్థానాలు వచ్చే అవకాశం ఉంది.

పుదుచ్చేరిలో మొత్తం 30 స్థానాలకు గాను ఎన్డీయే 19 నుంచి 23 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధిస్తుందని ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. కాంగ్రెస్-డీఎంకే కూటమి ఈసారి 7-11 స్థానాలకు పరిమితం కానుంది.

మరోపక్క, బెంగాల్‌లో బీజేపీ విజయ ఢంకా మోగిస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే చెప్పింది.  బీజేపీ‌ 183 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, తృణమూల్ కాంగ్రెస్ 95 స్థానాలతో రెండో స్థానానికి పరిమితం అవుతుందని తేల్చింది.

సీఎన్ఎక్స్ సర్వే మాత్రం బెంగాల్‌లో అధికారం మళ్లీ మమతదేనని పేర్కొంది. తృణమూల్‌కు గట్టిపోటీ ఇచ్చే బీజేపీ 135 స్థానాలు చేజిక్కించుకుంటుందని, తృణమూల్ కాంగ్రెెస్ 141 స్థానాలు కైవసం చేసుకుంటుందని పేర్కొంది. కాంగ్రెస్-వామపక్షాలు-ఐఎస్ఎఫ్‌లకు 16 స్థానాలు వస్తాయని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News