Arvind Kejriwal: ప్రజాస్వామ్యానికి దుర్దినం: అరవింద్ కేజ్రీవాల్ మండిపాటు
- రాజ్యసభలో జీఎన్డీటీడీ బిల్లుకు ఆమోదం
- కేంద్రంపై తన వంతు పోరాటం చేస్తానన్న కేజ్రీవాల్
- ప్రజలకు అధికారాన్ని దగ్గర చేస్తామని వెల్లడి
రాజ్యసభలో జీఎన్డీటీడీ (గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ) బిల్లు ఆమోదం పొందిన తరువాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్రం ప్రభుత్వం టార్గెట్ గా మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఓ దుర్దినమని అన్నారు. ప్రజలు ఎన్నకున్న ప్రభుత్వం వద్ద మరింత అధికారం ఉండేలా చూసేందుకు, అధికారంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు తనవంతు పోరాటం చేస్తానని అన్నారు.
"రాజ్యసభలోనూ జీఎన్సీటీడీ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. భారత ప్రజాస్వామ్యంలో దుర్దినం. మేము మరింతగా కష్టపడాలి. ప్రజలకు అధికారాన్ని తిరిగి అప్పగించేందుకు శ్రమిస్తాం. ఆ దిశగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా మంచి చేసేందుకే మేము ప్రయత్నిస్తాం. ఈ క్రమంలో ఆగబోము, నిదానించము" అని ట్వీట్ చేశారు.
ఇక ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా భారత చరిత్రలో చీకటి రోజని అభివర్ణించారు. "ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ హక్కులు హరించుకుపోతున్నాయి. ఢిల్లీని తీసుకుని వెళ్లి లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లో పెడుతున్నారు. ఇంత దుర్మార్గమా? ప్రజాస్వామ్యాన్ని హతమార్చేందుకు పార్లమెంట్ ను వినియోగించుకుంటున్నారు. ఈ నియంతృత్వ ధోరణిపై ఢిల్లీ వాసులు పోరాటం సాగిస్తారు" అని సిసోడియా తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
కాగా, పలు విపక్ష పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించినప్పటికీ, రాజ్యసభలో ఈ బిల్లుకు నిన్న ఆమోదం పడిన సంగతి తెలిసిందే. విపక్ష పార్టీలన్నీ వాకౌట్ చేసిన తరువాత బిల్లును ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు.