Cargo Ship: ఈజిప్టులోని సూయిజ్ కాలువలో ఇరుక్కుపోయిన ప్రపంచంలోనే అతిపెద్ద నౌక
- 2.20 లక్షల టన్నులతో వెళ్తున్న నౌక
- ఇతర నౌకల రాకపోకలకు అంతరాయం
- సముద్రపు దొంగల భయంతో అప్రమత్తం
ప్రపంచంలోనే అతిపెద్ద సరుకు రవాణా నౌకల్లో ఒకటైన ‘ఎంవీ ఎవర్‌గివెన్’ ప్రమాదవశాత్తు ఈజిప్టులోని సూయిజ్ కాలువలో చిక్కుకుపోయింది. దీంతో ఇతర నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 400 మీటర్ల పొడవున్న ఈ నౌక 2.20 లక్షల టన్నులతో ప్రయాణిస్తుండగా కాలువలో చిక్కుకుపోయింది. ఓడ తూర్పు పైభాగం తూర్పు గోడను, కింది భాగం పశ్చిమ గోడను తాకి నిలిచిపోయింది.
ఇలా జరగడం 150 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. సూయిజ్ కాలవలో నౌక నిలిచిపోవడంతో మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రాలలో అనేక ఓడల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చిక్కుకుపోయిన నౌకను తిరిగి గాడిలో పెట్టేందుకు కనీసం రెండు రోజులు పడుతుందని భావిస్తున్నారు. అయితే, ఈ లోపు ఇతర నౌకలపై సముద్రపు దొంగలు దాడిచేసే అవకాశం ఉండడంతో అప్రమత్తమయ్యారు.
కాలువలో ఉత్తరం వైపు మళ్లేందుకు ప్రయత్నించడం వల్లే ఓడ చిక్కుకుపోయిందని తెలుస్తున్నప్పటికీ, ఆ వైపుగా మళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేవలం 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు అంత పెద్ద నౌకను ప్రమాదానికి గురిచేయగలవా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.