Chandrababu: విశాఖ స్టీల్ ప్లాంట్ పై రెండు లేఖలు రాసిన చంద్రబాబు... క్లారిటీ ఇచ్చిన ప్రధాని కార్యాలయం!
- ఫిబ్రవరి 20న ఓ మారు, ఆపై మార్చి 10న మరోమారు లేఖ
- ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్
- స.హ. చట్టం ప్రశ్నకు పీఎంఓ సమాధానం
విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలను కేంద్రం ప్రారంభించిన వేళ, దాన్ని అడ్డుకునేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులూ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రధానికి రెండు లేఖలు కూడా రాశారు. ఈ లేఖలపై, తాజాగా సమాచార హక్కు చట్టం కింద ఓ కార్యకర్త రాసిన లేఖకు పీఎంఓ నుంచి వచ్చింది. చంద్రబాబు కూడా ఉక్కు ప్రైవేటీకరణ వద్దంటూ లేఖలు రాశారని స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 20న ఓ మారు, ఆపై మార్చి 10న ప్రధానికి చంద్రబాబు నాయుడు రెండు లేఖలు రాశారని, అవి పీఎంఓకు చేరాయని వాటికి సమాధానం కూడా ఇచ్చామని స.హ చట్టం కార్యకర్త రవికుమార్ కు వచ్చిన సమాధానంలో ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఈ లేఖలకు గడువులోగా జవాబును పంపాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్ మెంట్ విభాగానికి సూచించామని పేర్కొంది.
ఈ జవాబుతో విశాఖ ఉక్కుకు వ్యతిరేకంగా చంద్రబాబు ఏ విధమైన అడుగులూ వేయలేదని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తేలింది. ఇక తన లేఖలో విశాఖ ఉక్కును ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రైవేటీకరణ కాకుండా, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని చంద్రబాబు ప్రధానిని కోరారు. ప్రైవేటీకరణ ప్రయత్నాలను తక్షణమే విరమించాలని కూడా చంద్రబాబు డిమాండ్ చేశారు.