Alia Bhatt: పరువునష్టం కేసులో.. అలియా భట్​, సంజయ్​ లీలా భన్సాలీకి ముంబై కోర్టు సమన్లు

Mumbai Court Summons Alia Bhatt and Sanjay Leela Bhansali

  • మే 21లోపు కోర్టుకు రావాలని ఆదేశాలు
  • గంగూభాయ్ సినిమాపై పిటిషన్
  • తన తల్లి పరువు తీసేలా ఉందని కోర్టుకెక్కిన ఆమె దత్తపుత్రుడు
  • వారి మానసిక క్షోభ వర్ణించలేనిదన్న కోర్టు

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ, హీరోయిన్ అలియా భట్ కు ముంబై కోర్టు సమన్లు జారీ చేసింది. ప్రస్తుతం భన్సాలీ దర్శకత్వంలో 'గంగూభాయి కఠియావాడీ' అనే సినిమాను అలియా భట్ చేస్తోంది. అయితే, ఆ సినిమా కథాంశం మరణించిన తన తల్లిని కించపరిచేలా ఉందని పేర్కొంటూ గంగూభాయ్ దత్తపుత్రుడు బాబూ రావ్జీ షా కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

ఆ పిటిషన్ ను విచారించిన అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు.. మే 21లోపు కోర్టుకు రావాల్సిందిగా అలియా భట్, భన్సాలీ, సినిమా కథను రాసిన ఇద్దరు రైటర్లను ఆదేశించింది. తనపై, తన కుటుంబంపై సినిమా ప్రోమో, ట్రైలర్లరు ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయో రావ్జీ సవివరంగా తెలిపారని, వారు అనుభవిస్తున్న మానసిక క్షోభ వర్ణించలేనిదని వ్యాఖ్యానించింది.


బాబూ వాదన ఇది..

హుస్సేన్ జైద్ అనే రచయిత ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ అనే పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకంలోని ఓ భాగాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే, అది తన తల్లి పరువుకు భంగం కలిగించేలా ఉందని బాబూ రావ్జీ షా ఆరోపిస్తున్నారు. చనిపోయిన తన తల్లి ‘గోప్యత హక్కు’ను హరించేలా ఉందన్నారు. అందుకే డైరెక్టర్, హీరోయిన్, ఇద్దరు కథా రచయితలపై పరువు నష్టం దావా వేశానన్నారు.

అంతకుముందు కొట్టివేత

అంతకన్నా ముందు గత ఏడాది డిసెంబర్ లోనూ సినిమాపై రావ్జీ షా సివిల్ కోర్టుకెళ్లారు. ఆ పుస్తకంలో తన తల్లి గురించి తప్పుడు కథనం రాశారని, ఆ పుస్తకాన్ని అచ్చు వేయకుండా ఆపాలని, ఆ పుస్తకం ఆధారంగా తెరకెక్కిన సినిమాను, ప్రోమోలు, ట్రైలర్లను నిలుపుదల చేయాలని కోరారు. అయితే, కోర్టు ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది.

ఎప్పుడో 2011లో అచ్చయిన పుస్తకంపై ఇప్పుడు పిటిషన్ వేశారని, రావ్జీ వాదనకు అర్థం లేదని వ్యాఖ్యానించి పిటిషన్ ను కొట్టేసింది. ఆ పిటిషన్ ను కొట్టేయడంతో తన కుటుంబం పరువు తీసినందుకు రచయితలు, డైరెక్టర్లపై క్రిమినల్ యాక్షన్ ను తీసుకోవాలని కోరుతూ తాజాగా పిటిషన్ ను వేశారు. కాగా, ఈ సినిమా ఈ ఏడాది జులై 30న విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News