India: భారత క్రికెట్ జట్టులో మెషీన్ గన్ ఉన్నట్టుంది: ఇంజమామ్ ఉల్ హక్ పొగడ్తలు

Indian Cricket has Mechine Gun says Inzamam

  • ఇటీవలి కాలంలో భారత్ అద్భుత విజయాలు
  • ఎవరికి అవకాశం లభించినా విజృంభిస్తున్నారు
  • ఇదే కొనసాగితే టీ-20 వరల్డ్ కప్ ఇండియాదే
  • మీడియాతో పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్

ఇటీవలి కాలంలో భారత క్రికెట్ జట్టు సాధిస్తున్న విజయాలు అద్భుతమని, కొత్తవాళ్లు ఎంతమంది వస్తున్నా, రాణిస్తూ, సీనియర్ల పక్కన తమ స్థానాలను సుస్థిరం చేసుకునేందుకు తమవంతు ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారని పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ వ్యాఖ్యానించారు. ఇదంతా చూస్తుంటే, టీమిండియా చేతిలో ఏదో మెషీన్ గన్ ఉన్నట్టుగా అనిపిస్తోందని అన్నారు. తొలి వన్డేలో 55 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించిన అనంతరం ఇంజమామ్ మీడియాతో మాట్లాడారు.

నిత్యమూ ఎవరో ఒక కొత్త ప్లేయర్ జట్టులోకి వచ్చి రెచ్చిపోతున్నారని అభిప్రాయపడ్డ ఆయన, తాజాగా, తొలి మ్యాచ్ లు ఆడిన ప్రసిద్ కృష్ణ బౌలింగ్ లో, కృనాల్ పాండ్యా బ్యాటింగ్ లో ఇరగదీశారని అన్నారు. అవకాశం దొరికిన ఎవరూ వదిలి పెట్టడం లేదని, గడచిన ఆరు నెలలుగా సీనియర్లు, జూనియర్ల సమ్మేళనంతో భారత క్రికెట్ జట్టు అద్భుత విజయాలను సాధిస్తోందని పొగడ్తల వర్షం కురిపించారు.

ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, నటరాజన్ తదితరులు వెలుగులోకి వచ్చారని గుర్తు చేసిన ఇంజమామ్, ఇంగ్లండ్ తో జరిగే సిరీస్ లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా, ప్రసిద్ కృష్ణలు సత్తా చాటారని అన్నారు. ఇటువంటి యువ ఆటగాళ్ల కారణంగానే ఇండియా వరుసగా విజయాలు సాధిస్తూ, దూసుకుపోతోందని, ఇదే కొనసాగితే రానున్న వరల్డ్ కప్ టీ-20లో కప్పు ఎగరేసుకుపోతుందని జోస్యం చెప్పారు.

ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేను ప్రత్యేకంగా ప్రస్తావించిన ఇంజమామ్, ఈ మ్యాచ్ లో కృనాల్, రాహుల్ మధ్య నమోదైన 112 పరుగుల భాగస్వామ్యమే టర్నింగ్ పాయింట్ అని, అదే మ్యాచ్ ని ఇండియా వైపు వెళ్లేలా చేసిందని అన్నారు. ఓ దశలో 270 పరుగులు చేయడమే కష్టమన్న భావనలో ఉన్న వేళ, వీరిద్దరూ కలిసి స్కోరును 300 పరుగులు దాటించారని కితాబునిచ్చారు.

  • Loading...

More Telugu News