Fish: చేప కడుపులో 10 కిలోల ప్లాస్టిక్!
- కర్ణాటకలోని మంగళూరులో ఘటన
- చేపను కోస్తుండగా గుర్తించిన దుకాణ ఉద్యోగి
- ఇలాగైతే భవిష్యత్ లో చేపలు దొరకవన్న ఆందోళన
ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలు భూమ్మీదున్న జంతువులనే కాదు.. సముద్రంలోని జీవరాశులనూ ఎంత ప్రభావితం చేస్తున్నాయో చెప్పే ఘటన ఇది. ఓ చేప కడుపులో దాదాపు 10 కిలోల ప్లాస్టిక్ కవర్ల వ్యర్థాలు బయటపడ్డాయి.
కర్ణాటకలోని మంగళూరు నగరంలో ఉన్న అట్టావర్ లోని ఓ చేపల దుకాణంలో సోమవారం ఈ ఘటన జరిగింది. దుకాణ ఉద్యోగి చేపను కోస్తుండగా ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడ్డాయి. వాటి బరువు తూయగా 10 కిలోలున్నట్టు తేలింది. దీంతో ఆ యజమాని కంగు తిన్నాడు. అక్కడితో ఆగిపోకుండా ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీడియో కూడా తీశాడు.
‘‘నేను ఇలాంటి ఘటనను తొలిసారి చూస్తున్నాను. ప్రజలు సముద్రాల్లోకి ఇలాగే ప్లాస్టిక్ ను వేస్తూ పోతే.. చేపల ప్రత్యుత్పత్తిపై ప్రభావం పడుతుంది. కొన్నాళ్లలో చేపల జాతే అంతరించిపోయే ప్రమాదముంది’’ అని ఆ దుకాణ యజమాని ఆందోళన వ్యక్తం చేశాడు.
వాస్తవానికి చేపలు ప్లాస్టిక్ తినవని, చూసుకునే ఆహారాన్ని తీసుకుంటాయని కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ డీన్ డాక్టర్ ఎ. సెంథిల్ వెల్ చెప్పారు. ‘‘సముద్ర తీర ప్రాంతంలోని అడుగు భాగాన ప్లాస్టిక్ ఎక్కువగా ఉంటోంది. తమ వలలో పడుతున్న దాంట్లో 40 నుంచి 50 శాతం దాకా ప్లాస్టిక్ ఉంటోందని జాలర్లు చెబుతున్నారు. ఈ ఘటనలో ఆ చేప అడుగు భాగాన ఉన్న ప్లాస్టిక్ నే తిని ఉంటుంది. మామూలుగా అయితే మైక్రో ప్లాస్టిక్ లను చేపలు తెలియకుండా తినేస్తుంటాయి. నదులు, డ్రెయినేజీల నుంచే ఎక్కువగా ప్లాస్టిక్ సముద్రాల్లో కలుస్తోంది. దాని నియంత్రణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన చెప్పారు.