Kurnool District: కర్నూలు విమానాశ్రయం ప్రారంభం.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు ఖరారు
- ప్రారంభించిన సీఎం జగన్
- ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్య
- రాష్ట్రంలో ఇది 6వ విమానాశ్రయమన్న జగన్
- 28 నుంచి సర్వీసులు ప్రారంభం
కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో ఏర్పాటు చేసిన విమానాశ్రయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు ప్రారంభించారు. అంతకు ముందు టెర్మినల్ భవనం వద్ద దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహావిష్కరణలో ఆయన పలువురు మంత్రులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. గతంలో కర్నూలుకు రోడ్డు, రైలు మార్గంలోనే ప్రయాణం ఉండేది. ఇక నుండి విమాన ప్రయాణం కూడా జరగబోతోంది. రాష్ట్రంలో ఇది 6వ విమానాశ్రయం" అని అన్నారు.
ఈ నెల 28 నుంచి విమానాశ్రయంలో రాకపోకలు జరుగుతాయన్నారు. కర్నూలు చరిత్రలోనే ఇదో సుదినమని చెప్పారు. సిపాయి తిరుగుబాటు కంటే ముందే రైతుల పక్షాన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉద్యమం చేశారని, ఆయనకు నివాళిగా ఈ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్టుగా ఆయన ప్రకటించారు.
"ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు బాబు గతంలో ఎయిర్ పోర్ట్ డ్రామా ఆడారు. విమానాలు ఎగరని పరిస్థితులు, కనీసం రన్ వే పనులు కూడా పూర్తికాకముందే ఎన్నికల్లో లబ్దిపొందేందుకు రిబ్బన్ కట్ చేశారు" అని విమర్శించారు.
"మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, 5 ఫ్లోర్లలో ఎయిర్ ట్రాఫిక్ అడ్మిషన్ బిల్డింగ్, పోలీస్ బ్యారెక్, వీఐపీ లాంజ్, ప్యాసింజర్ లాంజ్, వాటర్ఓవర్ హెడ్ ట్యాంక్, సబ్ స్టేషన్, రన్ వేలోని బ్యాలెన్స్ పనులను పూర్తి చేశాం" అని జగన్ చెప్పారు.
"110 కోట్ల రూపాయల ఖర్చుతో అన్ని నిర్మాణాలను పూర్తి చేసి ఏడాదిన్నరలోనే విమానాశ్రయాన్ని ప్రారంభించాం. ప్యాసింజర్ టెర్మినల్ వద్ద కార్ రెంటల్, బేబీ కేర్, మెడికల్ కేర్ వంటి అన్ని సదుపాయాలను తీసుకొచ్చాం. ఏటీసీ, డీజీసీఏ అనుమతులు తెప్పించేందుకు అధికారులు విశేష కృషి చేశారు" అని జగన్ తెలిపారు.