Shreyas Iyer: ఇంగ్లండ్ తో మిగతా వన్డేలు, ఐపీఎల్ టోర్నీకి శ్రేయస్ అయ్యర్ దూరం
- గాయం తీవ్రమైనదేనన్న బీసీసీఐ వర్గాలు
- శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని వెల్లడి
- 4 నెలలు విశ్రాంతి అవసరమని కామెంట్
ఇంగ్లండ్ తో జరుగుతున్న సిరీస్ లో మిగతా వన్డేలకు టీమిండియా బ్యాట్స్ మన్ శ్రేయస్ అయ్యర్ దూరం అయ్యాడు. వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ టోర్నీ నుంచి కూడా తప్పుకొన్నాడు. మంగళవారం పూణె వేదికగా జరిగిన మొదటి వన్డేలో శ్రేయస్ ఎడమచేతికి గాయమైన సంగతి తెలిసిందే. ఎనిమిదో ఓవర్లో బెయిర్ స్టో కొట్టిన షాట్ ను ఆపే ప్రయత్నంలో అతడు డైవ్ చేశాడు. దీంతో ఎడమ మోచెయ్యి పై భాగంలో గాయమైంది.
అతడి గాయం తీవ్రమైనదేనని, చేతికి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని బీసీసీఐ వర్గాలు చెప్పాయి. శస్త్రచికిత్స చేస్తే దాదాపు 4 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరముందని వివరించాయి. ‘‘ఇంగ్లండ్ సిరీస్ తో పాటు ఐపీఎల్ మొత్తానికి శ్రేయస్ దూరమవుతాడు. మళ్లీ నెట్స్ లోకి రావాలంటే అతడికి 4 నెలల సమయం పడుతుంది. అతడి గాయం చాలా తీవ్రంగానే ఉంది’’ అని పేర్కొన్నాయి.
లాంకషైర్ తో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో.. జులై 23 నుంచి జరగాల్సిన ఆ టోర్నీలోనూ శ్రేయస్ పాల్గొనే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. కాగా, ఐపీఎల్ లో ఢిల్లీకి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ ఎడిషన్ లోనూ అతడినే కెప్టెన్ గా కొనసాగిస్తామని ఢిల్లీ డేర్ డెవిల్స్ ప్రాంఛైజీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అతడు టోర్నీకి దూరం కావడం ఆ టీమ్ కు ఎదురుదెబ్బే.