Ayyanna Patrudu: అసత్యప్రచారాలే పునాదులుగా నిర్మించుకున్న అధికారం కూలిపోయే రోజు దగ్గరపడింది: అయ్యన్నపాత్రుడు
- అసైన్డ్ భూములపై ఫేక్ ఫిర్యాదులు చేశారంటున్న టీడీపీ
- ఇచ్చిన మాట తప్పుతున్నాడంటూ సీఎంపై అయ్యన్న విసుర్లు
- ఫేక్ సీఎం బిరుదు సార్థకం చేసుకున్నాడని ఎద్దేవా
- అమరావతి అంతానికి కుట్రలు చేస్తున్నాడంటూ ఆగ్రహం
అసైన్డ్ భూముల వ్యవహారంలో ఫేక్ కేసులు నమోదు చేశారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శనాస్త్రాలు సంధించారు. పదో తరగతి పరీక్ష పేపర్లు ఎత్తుకెళ్లిపోయిన బుద్ధి జగన్ రెడ్డి ఇంకా మార్చుకోలేదని వ్యాఖ్యానించారు.
ఇచ్చిన ప్రతి మాట తప్పుతూ, వేసిన ప్రతి అడుగూ తప్పుతూ ఇప్పటికే ఫేక్ సీఎం అనిపించుకున్నాడని పేర్కొన్నారు. అమరావతి రైతుల పేరుతో సీఐడీకి ఫేక్ ఫిర్యాదులు ఇచ్చి ఫేక్ సీఎం బిరుదు సార్థకం చేసుకున్నాడని ఎద్దేవా చేశారు. అమరావతి అసైన్డ్ భూముల అంశంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులైనా నిజమైనవాళ్లా? లేక ఫేక్ సీఎం ఇచ్చిన ఫేక్ ఫిర్యాదుల్లాంటి ఫేక్ ఖాకీలా? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.
"నాడు విపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానికి అంగీకరించి, అధికారం చేపట్టాక కక్ష కట్టి మరీ అమరావతి అంతానికి కుట్రలు చేస్తున్నావు. వికేంద్రీకరణ పేరుతో నువ్వు చిమ్ముతున్న విద్వేషపు విషాన్ని టీడీపీ జనం ముందు ఉంచింది. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, ఎంత బెదిరింపులకు పాల్పడినా జగన్ రెడ్డి, ఆయన గ్యాంగ్ చెప్పేవన్నీ అవాస్తవాలేనని ప్రజలు కుండబద్దలు కొట్టారు. అసత్యప్రచారాలే పునాదులుగా నిర్మించుకున్న అధికారం కూలిపోయే రోజు దగ్గరపడింది" అంటూ సీఎం జగన్ పై అయ్యన్న విరుచుకుపడ్డారు.