Mukesh Ambani: సచిన్ వాజే ఇంట్లో 62 బుల్లెట్లు... తనని బలిపశువుని చేస్తున్నారన్న నిందితుడు
- ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో కీలక మలుపు
- వాజే ఇంట్లో ప్రభుత్వ లెక్కలోకి రాని బుల్లెట్లు స్వాధీనం
- కస్టడీని పొడిగించిన కోర్టు
- తొలుత మన్‌సుక్ ను కలవలేదన్న వాజే
- తాజాగా కలిసినట్లు ఆధారాలు లభ్యం
ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో నిండిన కారు నిలిపి ఉంచిన కేసులో సస్పెండై అరెస్టయిన ముంబయి పోలీస్ అధికారి సచిన్ వాజే ఇంట్లో ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) సోదాలు జరిపింది. ఆయన ఇంట్లో అక్రమంగా దాచిపెట్టిన తుపాకీ గుళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా ఇప్పటికే ఎన్‌ఐఏ ఆయనను అన్ని కోణాల్లో ప్రశ్నిస్తోంది. నేటితో ఆయన కస్టడీ ముగియనుండడంతో మరిన్ని వివరాలను రాబట్టేందుకు నిందితుడిని ఇంకొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని ఎన్‌ఐఏ కోర్టుని కోరింది. దీనికి అంగీకరించిన న్యాయస్థానం ఏప్రిల్ 3వ తేదీ వరకూ వాజేను కస్టడీకి అనుమతించింది.
మరోవైపు తన అరెస్ట్‌పై సచిన్ వాజే మాట్లాడుతూ.. తనని బలి పశువును చేశారని చెప్పుకొచ్చారు. కాగా,తాజాగా వాజే ఇంట్లో జరిపిన సోదాల్లో 62 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. అయితే, వీటన్నింటికీ ప్రభుత్వ లెక్కలు లేకపోవడం గమనార్హం. వాజే సర్వీస్ రివాల్వర్‌కు సంబంధించిన 30 బుల్లెట్లలో కేవలం ఐదింటిని మాత్రమే అధికారులు గుర్తించగా, మిగిలిన వాటి గురించి నిందితుడు ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదని అధికారులు తెలిపారు.
మరోవైపు ఈ కేసు దర్యాప్తును ఏన్‌ఐఏ అధికారులు వేగవంతం చేశారు. ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో నింపిన కారు యజమాని మన్‌సుక్ హిరేన్‌తో తనకెలాంటి సంబంధాలు లేవని సచిన్ వాజే ఇప్పటికే చెప్పారు. అయితే, ఫిబ్రవరి 17న మన్‌సుక్‌ను కలిసినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.