Ganta Srinivasa Rao: స్టీల్ ప్లాంట్ కోసం మంత్రులు రాజీనామా చేయాల్సిన సమయం ఆసన్నమైంది: గంటా
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
- ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా
- జగన్ తో కలిసి నడిచేందుకు చంద్రబాబు సిద్ధమని వెల్లడి
- చంద్రబాబు సీనియారిటీ పక్కనబెట్టి వస్తున్నారని వివరణ
- రాజీనామాలపై మంత్రులు నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి
విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణకు రాజీనామాలే మార్గం అని నమ్ముతున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి తన గళం వినిపించారు. స్టీల్ ప్లాంట్ కోసం ఏపీ మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తామని కేంద్రం ఇప్పటికే తేల్చి చెప్పిందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు తన సీనియారిటీని పక్కనబెట్టి జగన్ తో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారని వివరించారు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేస్తామని గంటా వెల్లడించారు. తాను రాజీనామా చేసిన అసెంబ్లీ స్థానంలో మళ్లీ పోటీ చేయనని స్పష్టం చేశారు.
ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కలిసినప్పటి వివరాలను కూడా గంటా పంచుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం కేటీఆర్ విశాఖ వస్తారని పేర్కొన్నారు.