ACB: ఏసీబీ అధికారులు వస్తున్నారని.. రూ. 20 లక్షలు కాల్చేసిన తహసీల్దార్
- లంచం తీసుకుంటూ పట్టుబడిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్
- తహసీల్దార్ చెబితేనే తీసుకున్నానన్న ఆర్ఐ
- తలుపులు మూసి రూ. 20 లక్షలు కాల్చి బూడిద చేసిన తహసీల్దార్
- మరో రూ. 1.5 లక్షల స్వాధీనం
ఏసీబీ అధికారులు తన ఇంటిపై దాడికి వస్తున్న విషయం తెలిసిన ఓ తహసీల్దార్ ఏకంగా 20 లక్షల రూపాయలను కాల్చిపడేశాడు. రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. జిల్లాలో ఓ వ్యక్తి నుంచి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పర్వత్ సింగ్ ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ మొన్న సాయంత్రం ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. అధికారులు అతడిని ప్రశ్నించడంతో ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని, తహసీల్దార్ కల్పేశ్ కుమార్ జైన్ చెప్పడంతోనే తానీ డబ్బులు తీసుకున్నట్టు చెప్పాడు.
దీంతో అధికారులు అతడిని తీసుకుని తహసీల్దార్ ఇంటికి బయలుదేరారు. విషయం తెలిసిన కల్పేశ్ ఇంటి తలుపులు మూసివేసి వంట గదిలోని స్టవ్‌పై లంచంగా తీసుకున్న లక్షలాది రూపాయలను భార్య సహకారంతో కాల్చివేశాడు.
ఇంటి లోపలి నుంచి నోట్ల కట్టలను కాలుస్తున్న వాసన రావడాన్ని గుర్తించిన ఏసీబీ అధికారులు డబ్బులు కాల్చొద్దని వారిని వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఏమాత్రం వినిపించుకోని కల్పశ్ మొత్తం డబ్బులను కాల్చేశాడు. ఈలోపు ఎలాగోలా ఇంట్లోకి చేరుకున్న అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే రూ. 20 లక్షలను కాల్చి బూడిద చేసినట్టు గుర్తించారు. మిగిలిన రూ. 1.5 లక్షలను అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు.