Yanamala: జగన్ దుష్ట సంప్రదాయాన్ని తీసుకొచ్చారు: యనమల విమర్శలు
- ఆర్డినెన్స్ రూపంలో బడ్జెట్ సరికాదు
- జగన్ పలాయనవాదానికి ఇది నిదర్శనం
- దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలా జరగలేదు
- గతంలోనూ ఇటువంటి తీరే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. ఆర్డినెన్స్ రూపంలో బడ్జెట్ పెట్టాలన్న ఆలోచనను తమ పార్టీ వ్యతిరేకిస్తోందని చెప్పారు. జగన్ పలాయనవాదానికి ఇది నిదర్శనమని చెప్పారు. ప్రజలు, ప్రతిపక్షాలు, చట్టసభలంటే వైసీపీకి లెక్కలేదని విమర్శించారు.
చివరికి బడ్జెట్ ను కూడా ఆర్డినెన్స్‌ల రూపంతో తీసుకొచ్చే దుష్ట సంప్రదాయాన్ని జగన్ తెచ్చారని యనమల వ్యాఖ్యానించారు. ఇటువంటి ఘటనలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవని చెప్పారు. మొక్కుబడి బడ్జెట్ తేవాలని చూశారని, దానితో పాటు మూడు రాజధానుల బిల్లును శాసన మండలి వ్యతిరేకించిందని తెలిపారు.
ఆ సమయంలోనూ ఆర్డినెన్స్ తెచ్చారని తెలిపారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఏ ప్రభుత్వమూ ఆర్డినెన్స్‌లు ఇవ్వలేదని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే తిరుపతి ఉప ఎన్నిక, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయంటూ బడ్జెట్ సమావేశాలు పెట్టకుండా వాయిదాలు వేయాలనుకుంటున్నారని చెప్పారు.