Telangana: తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి నిరుద్యోగుల యత్నం.. ట్రాఫిక్ జామ్
- ఏబీవీపీ కార్యకర్తలు, నిరుద్యోగ ఐక్య కార్యాచరణ సమితి ఆందోళన
- ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్
- విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు
ఏబీవీపీ కార్యకర్తలు, నిరుద్యోగ ఐక్య కార్యాచరణ సమితి నేతలు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో నాంపల్లిలో కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన తమను పోలీసులు అడ్డుకోవడంతో వారితో విద్యార్థులు వాగ్వివాదానికి దిగారు. పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించాలని, కాలయాపన చేయొద్దని ఈ సందర్భంగా ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని నిరుద్యోగ జేఏసీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. నిరుద్యోగుల గురించి పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచడం సరికాదని అన్నారు.