Hyderabad: అంతా అబద్ధం... మేమే డబ్బులిచ్చాం... అర్థరాత్రి బైక్ సీజ్ చేయడంపై తెలంగాణ పోలీసుల వివరణ

Police Clarity on Bike Sease on Night Time

  • సామాజిక మాధ్యమాల్లో వీడియో హల్ చల్
  • ట్రిపుల్ రైడింగ్, వితౌట్ లైసెన్స్ కింద కేసు నిజమే
  • అమ్మాయిని ఇంటికి చేర్చామన్న ట్రాఫిక్ ఏసీపీ

తెలంగాణలో స్కూళ్లను మూసివేయడంతో తన మామయ్యతో కలిసి బైక్ పై ఇంటికి వెళుతున్న ఆరవ తరగతి బాలికను పోలీసులు అడ్డుకున్నారని, ఆపై తమ వద్ద డబ్బులు లేవని ఎంతగా వేడుకున్నా పోలీసులు కనికరించలేదని సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, పోస్టులు వైరల్ కాగా, పోలీసు అధికారులు స్పందించారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, బోరబండ ప్రాంతానికి చెందిన రిషిక అనే బాలిక, కీసరలోని గురుకుల పాఠశాలలో చదువుకుంటోంది. విద్యా సంస్థలను మూసివేయడంతో ఆమెను తీసుకుని వెళ్లేందుకు మామయ్య కిరణ్, తన స్నేహితుడితో కలసి బైక్ పై వచ్చి రిషికను తీసుకుని బయలుదేరాడు. వారు వెళుతుండగా, మార్గమధ్యంలో తూంకుంట మునిసిపాలిటీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు.

ఆపై ట్రిపుల్ రైడింగ్ కేసును నమోదు చేసి, బైక్ ను సీజ్ చేశారు. వారు పోలీసులను వేడుకుంటూ, విషయం చెబుతూ, తమ వద్ద డబ్బులు లేవని విన్నవించినా, పోలీసులు వినలేదు. ఆ తరువాత వారు కొంత దూరం నడుస్తూ వెళ్లి, ఆపై లిఫ్ట్ అడుక్కుని తెల్లవారుజాముకు ఇంటికి చేరినట్టు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వచ్చాయి.

దీనిపై స్పందించిన ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి, ట్రిపుల్ రైడింగ్ తో పాటు, బైక్ నడిపే వ్యక్తి వద్ద లైసెన్స్ లేకపోవడంతో కేసు రిజిస్టర్ చేశామని, ఆపై బాలికను ఇంటికి చేర్చేందుకు ఏర్పాట్లు చేశామని, హైదరాబాద్ లోని వై జంక్షన్ వరకూ వెళ్లేందుకు ఓ కంపెనీకి చెందిన బస్సును ఎక్కించి, అక్కడి నుంచి ఇంటికి వెళ్లేందుకు రూ. 100 కూడా ఇచ్చామని అన్నారు. తమపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు.

  • Loading...

More Telugu News