Suez Canal: సూయజ్ కాలువలో ఇరుక్కుపోయిన నౌక నిలిచిపోయిన రవాణా.. గంటకు రూ.2,900 కోట్ల వ్యాపారంపై ప్రభావం
- రోజూ రూ.69,500 కోట్లకుపైనే వ్యాపారం
- నౌకను తప్పించేందుకు మరింత సమయం
- అటూ ఇటూ నిలిచిన 160 ఓడలు
సూయజ్ కాలువలో అడ్డం తిరిగిన ఎవర్ గ్రీన్ నౌకతో మూడు రోజులుగా అటూ ఇటూ అన్నీ జామ్ అయిపోయాయి. ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు దారి మూసుకుపోయింది. దీంతో ఎక్కడి సరుకు రవాణా అక్కడే నిలిచిపోయింది. దీని వల్ల గంటకు సుమారు రూ.2,900 కోట్ల (40 కోట్ల డాలర్లు) వ్యాపారంపై ప్రభావం పడుతున్నట్టు లాయిడ్స్ లిస్ట్ అనే షిప్పింగ్ సంస్థ డేటా చెబుతోంది. అదే ఒక్క రోజుకైతే సుమారు రూ.69,520 కోట్ల (960 కోట్ల డాలర్లు) వ్యాపారంపై ప్రభావం పడుతోందని లెక్కగట్టింది.
యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య రవాణా సదుపాయాలను పెంచేందుకు వీలుగా ఎర్ర సముద్రం, మధ్యదరా సముద్రాన్ని కలుపుతూ ఈజిప్ట్ లో ఈ సూయజ్ కాల్వను తవ్వారు. 250 మీటర్ల వెడల్పుండే ఈ కాల్వలో 400 మీటర్ల పొడవుండే ఎవర్ గ్రీన్ ఇరుక్కుపోయింది. 20 వేల కంటెయినర్లను తీసుకెళ్లగలిగే 2 లక్షల టన్నుల బరువున్న ఆ షిప్పును తొలగించడమే ఇప్పుడు అధికారులకు తలకుమించిన భారమవుతోంది. అడ్డం తిరగడానికి కారణమైన గాలులు.. ఇప్పుడు లేకపోవడంతో దానిని తప్పించలేకపోతున్నామని సూయజ్ కెనాల్ అధికారులు చెబుతున్నారు.
ఇరుక్కుపోయిన షిప్పును తొలగించేందుకు మరో వారమైనా పట్టొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే అటూ ఇటూ రెండు వైపులా 160 దాకా ఓడలు అక్కడ చిక్కుకుపోయాయి. ఇప్పుడు ఆ షిప్పును తీసేసినా.. అక్కడే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన షిప్పులను వాటి గమ్యస్థానాలకు చేర్చేందుకు సమయం పడుతుందని, ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి రోజులు లేదా వారాలు పట్టొచ్చని అంటున్నారు.
అందులో 41 బల్క్ క్యారియర్లు, 34 దాకా ముడి చమురు నౌకలున్నట్టు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే యూరప్ దేశాల్లో ఇంధన ధరలు మరింత పెరిగే ప్రమాదముందంటున్నారు. ఇప్పటికే సౌదీ అరేబియా వంటి చమురు ఉత్పత్తి దేశాల్లో ముడి చమురు ఉత్పత్తి తగ్గిపోవడం, సరఫరా లేకపోవడంతో ధరలు పెరిగాయి. ఇప్పుడు ఈ ఓడ ప్రభావంతో రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ అవుతాయన్న ఆందోళన నెలకొంది.
ఇటీవలి కాలంలో సూయజ్ కాల్వ మార్గంలో ట్రాఫిక్ భారీగా పెరిగింది. ఇప్పుడు ఎవర్ గ్రీన్ ప్రమాద నేపథ్యంలో చాలా కంపెనీలు మరో మార్గంపైనా దృష్టి పెడుతున్నాయి. వీలైనంత వరకు సూయజ్ కాల్వ మార్గంలో వెళ్లకుండా ఉండేందుకే ప్రయత్నిస్తున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద షిప్పింగ్ సంస్థలైన మేయర్స్, హపగ్ లాయిడ్ సంస్థలు ఈ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది.