USA: చైనాకు చెక్ పెట్టేందుకు తైవాన్ తో అమెరికా కీలక ఒప్పందం
- తీర రక్షణ దళాల బలోపేతానికి చర్యలు
- దక్షిణ చైనా సముద్రం, పసిఫిక్ మహా సంద్రంలో చైనా ఆగడాలు
- తైవాన్ పై యుద్ధానికి కాలు దువ్వుతున్న డ్రాగన్ కంట్రీ
చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా కీలక చర్యలు తీసుకుంటోంది. తైవాన్ పై కయ్యానికి కాలుదువ్వుతుండడం.. దక్షిణ చైనా సముద్రం, పసిఫిక్ మహా సంద్రంలో డ్రాగన్ దేశం ఆధిపత్యం పెరుగుతుండడంతో అగ్రరాజ్యం కూడా దూకుడుగానే వెళ్తోంది.
ఈ క్రమంలోనే తీర రక్షణ దళాలను మరింత బలోపేతం చేయడం కోసం తైవాన్ తో ఒప్పందం చేసుకుంది. తీర రక్షణ దళాల మధ్య పరస్పర సహకారం, సమాచార మార్పిడి కోసం రెండు దేశాలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. దీనిపై తైవాన్ లోని అమెరికా ఎంబసీ అధికారులు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
ఈ ఒప్పందం గురించి తైవాన్ ప్రధాని సు షెంగ్ షాంగ్ ను ప్రశ్నించగా.. విదేశీ నౌకలు కనిపిస్తే కాల్చివేసేలా తీర రక్షణ దళాలకు జనవరిలో చైనా ఆదేశాలిచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఆ నిర్ణయం పొరుగుదేశాలను షాక్ కు గురి చేసిందని అన్నారు. శాంతి, స్థిరత్వం కోసం పరస్పర విలువలతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. వివాదాస్పద జలాల్లో మిత్ర దేశాలకు సాయం అందించేందుకు గానూ అమెరికా పశ్చిమ పసిఫిక్ లో కోస్ట్ గార్డ్ లను మోహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే తైవాన్ తో ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే, తైవాన్ సముద్ర జలాల్లో అమెరికా తన నౌకలను మోహరిస్తుందా? లేదా? అన్నది మాత్రం తెలియరాలేదు. కాగా, తైవాన్ తమ దేశమేనంటూ చైనా ఆక్రమణ వాదనలకు తెరదీసిన సంగతి తెలిసిందే. ఎలాగైనా లొంగబరుచుకోవాలన్న ఉద్దేశంతో ఇటీవల యుద్ధ విమానాలనూ పంపించింది. అంతేగాకుండా చేపలు పట్టేందుకు వాడే మర పడవలను తైవాన్ పైకి ఉసిగొల్పింది.