North Korea: క్షిపణుల ప్రయోగాలపై ఉత్తర కొరియా అధికారిక ప్రకటన, ఫొటోలు విడుదల
- 600 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించాయని వెల్లడి
- అణు సామర్థ్యం కలిగి ఉండే క్షిపణులని ప్రకటన
- రెండున్నర టన్నుల పేలోడ్ లను మోసుకెళ్తుందని కామెంట్
గురువారం చేసిన క్షిపణుల ప్రయోగం గురించి ఉత్తర కొరియా స్పందించింది. శుక్రవారం కొరియా అధికారిక వార్తా సంస్థ అయిన కేసీఎన్ఏ ద్వారా అధికారిక ప్రకటనను విడుదల చేసింది. మిసైళ్లను ప్రయోగించిన ఫొటోలను విడుదల చేసింది. రెండు క్షిపణులను ప్రయోగించామని, అవి కొత్త రకం గైడెడ్ మిసైల్స్ అని ప్రకటించింది. దేశ తూర్పు తీరంలోని 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఆ రెండు క్షిపణులు విజయవంతంగా ఛేదించాయని పేర్కొంది.
రెండున్నర టన్నుల పేలోడ్ లను ఇవి మోసుకెళ్లగలవని, అణు బాంబులు తీసుకెళ్లే సామర్థ్యం ఉందని తెలిపింది. ఈ రెండు క్షిపణులు ఉత్తర కొరియా సైన్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని క్షిపణుల ప్రయోగాన్ని పర్యవేక్షించిన సైనికాధికారి రి ప్యోంగ్ చోల్ చెప్పారు. క్షిపణుల ప్రయోగాన్ని దగ్గరుండి పరిశీలిస్తున్న సైనికాధికారుల ఫొటోనూ ఉత్తర కొరియా విడుదల చేసింది.
బైడెన్ అమెరికా అధ్యక్షుడయ్యాక కొరియా చేసిన తొలి బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం ఇదే కావడం గమనార్హం. దీనిపై సందర్భం వచ్చినప్పుడు స్పందిస్తామని బైడెన్ అన్నారు. అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలు.. ప్రయోగంపై విమర్శలు కురిపించాయి. బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు చేయకుండా ఉత్తరకొరియాను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం నిషేధిత జాబితాలో పెట్టింది. అయినా కూడా ఉత్తర కొరియా ప్రయోగాలు చేసింది.