Maharashtra: లాక్ డౌన్ పెడతాం.. జాగ్రత్త: ప్రజలకు మహా డిప్యూటీ సీఎం హెచ్చరిక
- కరోనా నిబంధనలను పాటించకుంటే లాక్ డౌన్ తప్పదని వెల్లడి
- ఏప్రిల్ 2 వరకు చూసి నిర్ణయం తీసుకుంటామని కామెంట్
- హోలీ కోసం జనాలు గుమిగూడొద్దని సూచన
మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ దారుణంగా ఉంది. కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. అయినా ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనలను జనం పాటించట్లేదు. అదే నిర్లక్ష్యం వహిస్తున్నారు. జనాల తీరుతో విసిగిపోయిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్.. వారికి హెచ్చరికలు జారీ చేశారు. ఇలాగే కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ పోతే బలవంతంగా లాక్ డౌన్ పెడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఏప్రిల్ 2 వరకు పరిస్థితిని చూసి.. ఆ తర్వాత లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
శుక్రవారం కరోనా పరిస్థితిపై పూణెలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. హోలీ పండుగ నేపథ్యంలో కఠినమైన ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ఎక్కడా ఎవరూ గుంపులుగా చేరొద్దని సూచించారు. భౌతిక దూరం నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
లేదంటే వచ్చే వారం నుంచి కఠినమైన లాక్ డౌన్ ను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కేసులు ఇలాగే పెరుగుతూ పోతే లాక్ డౌన్ తప్ప వేరే మార్గమే లేదని అధికారులు చెప్పారన్నారు. ప్రస్తుతం కరోనా ఆస్పత్రులు పాక్షికంగానే పనిచేస్తున్నాయని, వచ్చే నెల మొదటి వారం నాటికి వాటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో సగం బెడ్లను కరోనా కోసం సిద్ధం చేసి పెట్టామన్నారు.