Maharashtra: ఐఎఫ్ఎస్ అధికారి లైంగిక వేధింపులు.. మహారాష్ట్ర అటవీశాఖ అధికారి ‘లేడీ సింగమ్’ ఆత్మహత్య

Maharashtras Lady Singham found dead

  • లైంగికంగా, మానసికంగా దీపాలికి వేధింపులు
  • గర్భంతో ఉన్న విషయం తెలిసి కూడా అడవిలో కిలోమీటర్ల కొద్దీ నడిపించిన వైనం
  • నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో శివకుమార్ అరెస్ట్
  • నిందితులను వదిలిపెట్టబోమన్న డిప్యూటీ సీఎం

అటవీ మాఫియాకు సింహస్వప్నంగా మారి ‘లేడీ సింగమ్’గా గుర్తింపు పొందిన మహారాష్ట్ర అటవీ అధికారి దీపాలి చవాన్ (28) సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మెల్గాట్ టైగర్ రిజర్వు (ఎంటీఆర్) సమీపంలోని హరిసాల్ గ్రామంలో ఉన్న తన అధికారిక నివాసంలో, తల్లి లేని సమయంలో గురువారం పొద్దుపోయాక ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు ఆమె రాసిన నాలుగు పేజీల సూసైడ్ నోట్ సంచలనమైంది. ఐఎఫ్ఎస్ అధికారి, డిప్యూటీ కన్జర్వేటర్ (డీసీఎఫ్) వినోద్ శివకుమార్ లైంగిక వేధింపులు భరించలేకే తానీ నిర్ణయం తీసుకున్నట్టు అందులో ఆమె పేర్కొన్నారు.

శివకుమార్ తనను ఎలా వేధింపులకు గురిచేసిందీ, ఎంతగా చిత్రహింసలు పెట్టిందీ దీపాలి తన సూసైడ్‌ నోట్‌లో రాసుకొచ్చారు. అతని ఆగడాలపై సీనియర్, ఎంటీఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్.శ్రీనివాసరెడ్డికి పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన పట్టించుకోలేదని ఆ లేఖలో ఆమె వాపోయారు. దీపాలి గతేడాదే వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెల మొదట్లో గర్భిణిగా ఉన్న ఆమెను శివకుమార్ పెట్రోలింగ్ పేరుతో మూడు రోజులపాటు అడవిలోకి తీసుకెళ్లాడని ఆమె సన్నిహితురాలు ఒకరు తెలిపారు.

గర్భంతో ఉందన్న విషయం తెలిసీ ఆయన అడవిలో కిలోమీటర్ల దూరం నడిపించాడని, వందలాది కిలోమీటర్లు వాహనంపై తిప్పాడని ఆమె ఆరోపించారు. దీంతో గర్భస్రావం కావడంతో దీపాలి తీవ్ర మనోవేదనకు గురైందని ఆమె తెలిపారు.

ఇదిలావుంచితే, వేధింపులకు గురిచేసిన డీసీఎఫ్ వినోద్ శివకుమార్ బెంగళూరు వెళ్లేందుకు నాగపూర్ రైల్వే స్టేషన్‌లో ఎదురుచూస్తున్న సమయంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి అమరావతి తరలించారు. నిందితుడు శివకుమార్‌ను సస్పెండ్ చేస్తూ అటవీశాఖ ముఖ్య కన్జర్వేటర్ అరవింద్ ఆప్టే నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, దీపాలి ఫిర్యాదుకు స్పందించని ఎంటీఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి బాధ్యతలను మరొకరికి బదిలీ చేశారు.

దీపాలి ఆత్మహత్యపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మాట్లాడుతూ నిందితులను వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు. దీపాలి ఆరోపణలపై అన్ని కోణాల్లోనూ విచారణ జరిపిస్తామన్నారు.

  • Loading...

More Telugu News