Karnataka: బెంగళూరులో నర్సింగ్ విద్యార్థి కిడ్నాప్.. రూ. 2 కోట్ల డిమాండ్
- ఏడు గంటల్లోనే కిడ్నాపర్ల ఆట కట్టించిన పోలీసులు
- లండన్‌లో నర్సింగ్ చేస్తున్న రబీజ్
- అప్పులు తీర్చేందుకు నిందితుల కిడ్నాప్ పథకం
నర్సింగ్ విద్యార్థిని కిడ్నాప్ చేసి రూ. 2 కోట్లు డిమాండ్ చేసిన దుండగుల ఆటను పోలీసులు గంటల వ్యవధిలోనే కట్టించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన రబీజ్ అరాఫత్ లండన్‌లో నర్సింగ్ ఎంఎస్ చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో ఇంటికి వచ్చిన అతను ప్రస్తుతం బెంగళూరులోనే ఉంటున్నాడు. మొన్న మధ్యాహ్నం ఓ ఫోన్ రావడంతో బయటకు వెళ్లిన రబీజ్‌ను కారులో వచ్చిన దుండగులు కొందరు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.
రబీజ్ తండ్రికి ఫోన్ చేసి రూ. 2 కోట్లు డిమాండ్ చేశారు. దీంతో ఆయన కేజీహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఐదు ప్రత్యేక పోలీసు బృందాలు సీసీకెమెరాల ఆధారంగా కిడ్నాపర్ల కోసం వేట ప్రారంభించాయి. చివరికి ఏడు గంటల్లోనే కిడ్నాపర్ల ఆట కట్టించి వారి నుంచి యువకుడిని రక్షించారు.
నిందితులు అబ్దుల్ పహాద్, జబీవుల్లా, సయ్యద్ సల్మాన్, తౌహీద్‌లను అరెస్ట్ చేశారు. మరికొందరితో కలిసి వీరు ఈ కిడ్నాప్ పథకం పన్నినట్టు పోలీసులు తెలిపారు. అప్పులు తీర్చేందుకు కిడ్నాప్‌లు చేయాలని నిర్ణయించిన ముఠా.. నగరంలోని ధనవంతుల గురించి ఆరా తీసింది. ఈ క్రమంలో రబీజ్ కుటుంబం కారును కొనుగోలు చేసిన విషయం తెలుసుకుని కిడ్నాప్ ప్లాన్ రచించినట్టు పోలీసులు తెలిపారు. ఈ కిడ్నాప్ సూత్రధారి అయిన అబ్దుల్ పహాద్‌పై గతంలోనూ కిడ్నాప్ కేసు నమోదైనట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.