Virat Kohli: మరో ఘనతను సాధించిన విరాట్ కోహ్లీ
- వన్డే మూడో స్థానంలో బ్యాటింగ్ చేసి 10 వేల పరుగులు సాధించిన కోహ్లీ
- 190 ఇన్నింగ్స్ లలో ఈ ఫీట్ సాధించిన భారత సారధి
- ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్న రికీ పాంటింగ్
నిన్న ఇంగ్లండ్ తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనతను సాధించాడు. వన్డేల్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసి 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. ఈ జాబితాలో కోహ్లీ కంటే ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నాడు. 330 ఇన్నింగ్స్ లలో మూడో స్థానంలో బరిలోకి దిగిన పాంటింగ్ 12,662 పరుగులు చేశాడు. 190 ఇన్నింగ్స్ లలోనే కోహ్లీ 10 వేల మార్కును దాటడం గమనార్హం. నిన్నటి వన్డేలో 66 పరుగులు చేసిన కోహ్లీ.. ఈ ఫీట్ ను సాధించాడు.
ఈ జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర మూడో స్థానంలో ఉన్నాడు. 238 ఇన్నింగ్స్ లలో సంగక్కర 9,747 పరుగులు చేశాడు. 7,774 పరుగులతో దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్ మెన్ జాక్వెస్ కల్లిస్ ఉన్నాడు. రికీ పాంటింగ్ రికార్డును అధిగమించడానికి కోహ్లీకి మరెంతో కాలం పట్టదని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.