West Bengal: పశ్చిమ బెంగాల్ తొలి దశ ఎన్నికల నేపథ్యంలో కాల్పులు!
- పుర్బా మేదినిపూర్ జిల్లాలో ఘటన
- సత్సాతామల్ నియోజకవర్గంలో కాల్పులకు తెగబడ్డ కార్యకర్తలు
- ఇద్దరికి తీవ్రగాయాలు
- బీజేపీ, టీఎంసీ పరస్పర ఆరోపణలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పుర్బా మేదినిపూర్ జిల్లాలోని సత్సాతామల్ నియోజకవర్గంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద కొందరు కాల్పులకు పాల్పడడంతో ఇద్దరు భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.
వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఓటర్లను భయపెట్టేందుకు బీజేపీ కార్యకర్తలే కాల్పులకు తెగబడుతున్నారని టీఎంసీ నేతలు అంటున్నారు. టీఎంసీ నేతలు ఉద్దేశపూర్వకంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని, వారే అక్రమాలకు పాల్పడుతున్నారని బీజేపీ నేత అనూప్ చక్రవర్తి ఆరోపించారు.
కాగా, కోంటై నియోజకవర్గంలోని 149వ నంబర్ పోలింగ్ కేంద్రం వద్ద టీఎంసీ శ్రేణులు అవకతవకలకు పాల్పడుతున్నారని బీజేపీ నేత సువేందు అధికారి సోదరుడు సౌమెందు అధికారి ఆరోపణలు చేశారు. బీజేపీకి మద్దతు తెలుపుతోన్న ఓటర్లను పోలింగ్ బూత్‌లోకి వెళ్లకుండా టీఎంసీ శ్రేణులు అడ్డుకుంటున్నాయని అన్నారు.
ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పారు. పోలింగ్‌ను అధికారులు సజావుగా సాగేలా చూడాలని కోరారు. దీనిపై తాము ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశామని, పలు విషయాలను తెలిపామని ఆయన అన్నారు.