Thierry Henry: వర్ణవివక్షను నిరసిస్తూ.. సోషల్ మీడియాకు దూరమైన ఫుట్‌బాల్ దిగ్గజం

French Football Legend Thierry Henry Quits Social Media
  • ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లకు గుడ్ బై చెప్పిన థియర్రీ హెన్రీ
  • సోషల్ మీడియాలో 14.8 మిలియన్ల ఫాలోయర్లను కలిగిన హెన్రీ
  • పరిస్థితి మారేంత వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని ప్రకటన
సాకర్ దిగ్గజం, ఫ్రాన్స్ జట్టు మాజీ స్ట్రయికర్ థియర్రీ హెన్రీ సోషల్ మీడియా కు గుడ్ బై చెప్పాడు. వర్ణ వివక్ష, వేధింపులను అరికట్టేందుకు సోషల్ మీడియా మరింత కృషి చేసేంత వరకు తాను వీటికి దూరంగా ఉంటానని ఆయన ప్రకటించారు.

దుర్భాషలాడటం, తిట్టడం వంటి ఘటనల నేపథ్యంలో ఇప్పటికే సోషల్ మీడియాకు దూరమైన వారి జాబితాలోకి హెన్రీ చేరాడు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లలో ఆయనకు 14.8 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. ఈరోజు నుంచి అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లకు దూరంగా ఉండబోతున్నానని తెలిపాడు. వర్ణవివక్ష, బెదిరింపులు, మానసిక అశాంతికి గురి చేయడం వంటివి చాలా విషపూరితమైనవని, వీటిని పట్టించుకోకుండా వదిలేయలేమని చెప్పాడు. వీటిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ఎంతో బాధ్యతను తీసుకోవాలని తెలిపాడు.

సోషల్ మీడియాలో చాలా సులువుగా అకౌంట్లను ప్రారంభించి... ఎదుటి వ్యక్తిని టార్చర్ చేయడానికి వాటిని వాడుతున్నారని హెన్రీ ఆవేదన వ్యక్తం చేశాడు. మార్పు వచ్చేంత వరకు సోషల్ మీడియాకు తాను దూరంగానే ఉంటానని స్పష్టం చేశాడు.

ఫ్రాన్స్ తరపున ఆల్ టైమ్ హైస్కోరర్ గా నిలిచిన హెన్రీకి కూడా వర్ణవివక్ష తప్పలేదు. ఫుట్ బాల్ లో ఉన్న వర్ణవివక్షపై ఆయన ఎంతో కాలంగా తన గళం వినిపిస్తున్నాడు.
Thierry Henry
Social Media
Racism
France

More Telugu News