CPM: కేరళలలో మరోమారు తెరపైకి శబరిమల... మహిళల ప్రవేశంపై పెరుగుతున్న వేడి!
- మరో రెండు వారాల్లో ముగియనున్న ప్రచారం
- మూడేళ్ల నాటి ఘటనలను తెరపైకి తెచ్చిన బీజేపీ
- కేసు సుప్రీంకోర్టులో ఉందంటున్న అధికార సీపీఎం
కేరళలో మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్న వేళ, ఇప్పటికే అధికార, విపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్న వేళ, మరోమారు శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై చర్చ మొదలైంది. గడచిన మూడు నాలుగేళ్లలో జరిగిన పరిణామాలు సీపీఎంను వెంటాడుతున్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా మూడేళ్ల క్రితం ఆలయంలో జరిగిన ఘటనలు ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు వ్యతిరేకంగా మారాయని, ఇప్పుడు ఎన్నికలు సమీపించిన వేళ, మరోమారు అదే విషయం ఆయనకు వ్యతిరేకంగా మారుతోందని అంటున్నారు.
కాగా, 2018లో శబరిమల ఆలయంలోకి రుతుస్రావం వయసులో ఉన్న మహిళలు కూడా వెళ్లవచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తరువాత, పినరయి విజయన్, ఆ తీర్పును సమర్ధించిన విషయాన్ని ఇప్పుడు విపక్షాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న పినరయి ప్రవర్తనను ఎత్తి చూపుతున్నాయి.
ఇదే సమయంలో సీపీఎం సైతం ఈ విషయాన్ని చాలా చిన్నదిగా చూపేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఈ విషయం సుప్రీంకోర్టులోని అత్యున్నత ధర్మాసనం ముందుకు వెళ్లిందని, ఏ భక్తుని నమ్మకాన్నీ తాము వమ్ము చేయబోమని, ఇదే సమయంలో రాజ్యాంగంపై తమకు నమ్మకం ఉందని పినరయి విజయన్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ప్రస్తుతం తానేమీ వ్యాఖ్యానించబోనని, ప్రస్తుతం యథాతథ స్థితి కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
అయితే, శబరిమల విషయంలో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, నష్ట నివారణ ప్రయత్నాల్లో ఉన్న అధికార నేతలు ఇప్పుడు తమ మనసు మార్చుకున్నారు. ఇటీవల జరిగిన ఓ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన కేరళ దేవాలయ వ్యవహారాల శాఖా మంత్రి కడకంపల్లి సురేంద్రన్, 2018లో శబరిమల అయ్యప్ప దేవాలయంలో జరిగిన ఘటనలు దురదృష్టకరమైనవేనని, ప్రతిఒక్కరూ వాటిని చూసి బాధపడ్డారని అనడం గమనార్హం. శబరిమలలో మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ, మూడేళ్ల క్రితం నిరసలు తెలిపిన బీజేపీ మహిళా నేత శోభపై ఆయన ప్రస్తుతం కాజకుట్టం నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు.
ఒక్క కాజకుట్టం నియోజకవర్గమే కాదు. చాలా చోట్ల బీజేపీ అభ్యర్థులు శబరిమల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ, ప్రజల్లోకి వెళ్లి, ఓట్లను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ, సెంట్రల్ కేరళలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో ప్రజలు శబరిమల ఆచార వ్యవహారాలను పాటించడంలో అత్యంత భక్తి శ్రద్ధలు చూపుతారన్న సంగతి తెలిసిందే. అదే ఇప్పుడు పినరయి విజయన్ కు వ్యతిరేకంగా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.