Suez Cannal: సూయజ్ కాలువలో ఆగిన 120 షిప్ లు... శాటిలైట్ చిత్రాలు విడుదల!
- మంగళవారం నాడు చిక్కుకున్న నౌక
- మాక్సర్ వరల్డ్ వ్యూ శాటిలైట్ దృశ్యాలు విడుదల
- యూరప్, ఆసియాల మధ్య ఆగిన వాణిజ్యం
భారీ ఎత్తున కంటెయినర్లతో వెళుతున్న ఎంవీ ఎవర్ గ్రీన్ నౌక, ఈజిప్ట్ సమీపంలోని సూయజ్ కెనాల్ లో చిక్కుకుని పోగా, దాదాపు 120 షిప్ లు ఎటూ కదల్లేక కాలువలో నిలిచిపోయాయి. మంగళవారం నాడు కెనాల్ లోని ఇసుక మేటల్లో నౌక అడ్డుగా చిక్కుకుని పోగా, ఎన్నో దేశాలకు చేరుకోవాల్సిన నౌకలు నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించిన హై రెజల్యూషన్ శాటిలైట్ చిత్రాలు విడుదల అయ్యాయి. దాదాపు 2,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ నౌకలు ముందుకు సాగేందుకు అనుమతి కోసం వేచి చూస్తున్నాయి.
ఈ చిత్రాలను మాక్సర్ వరల్డ్ వ్యూ శాటిలైట్ చిత్రీకరించింది. ఈ కృత్రిమ వాణిజ్య నౌకా మార్గం ఎన్నో దేశాల అవసరాలను తీరుస్తున్నదన్న సంగతి తెలిసిందే. ఇసుక మేటల్లో చిక్కుకున్న నౌకను తొలగించేందుకు దాదాపు 5 రోజులుగా సాగుతున్న ప్రయత్నాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రాలను కలుపుతూ ఈ కెనాల్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.
ఇప్పటివరకూ సుమారు 9.6 బిలియన్ డాలర్ల నష్టం సంభవించిందని, ఆసియా, యూరప్ దేశాల మధ్య వాణిజ్యానికి విఘాతం కలిగిందని అధికారులు అంటున్నారు. ఈ విషయమై సూయజ్ కెనాల్ అథారిటీ చీఫ్ ఒసామా రాబీ స్పందిస్తూ, ఈ ప్రమాదం కారణంగా తమకు రోజుకు 14 మిలియన్ డాలర్ల ఆదాయ నష్టం సంభవిస్తోందని, నౌకను పక్కకు తీసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. సాంకేతిక టీమ్ లు ఈ విషయమై నిర్విరామంగా కృషి చేస్తున్నాయని, అయితే, బలమైన గాలులు, వాతావరణ పరిస్థితులు కొంత అడ్డంకిగా మారినా, సాధ్యమైనంత త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని భావిస్తున్నామని తెలిపారు.