Vote On Account: ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఏపీ గవర్నర్ ఆమోద ముద్ర... వరుసగా మూడోసారీ ఆర్డినెన్స్

Governor gives nod for vote on account budget
  • వివిధ కారణాలతో 2019 నుంచి ఓటాన్ అకౌంట్
  • ఆర్డినెన్స్ తో బడ్జెట్ ఆమోదం
  • తొలి మూడు నెలలకు వర్తింపు
  • నిధుల వ్యయానికి వెసులుబాటు
ఏపీలో వరుసగా మూడోసారీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఆర్డినెన్స్ జారీ చేశారు. తాజా ఆర్థిక సంవత్సరం 2021-22 తొలి మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలుపగా, ప్రభుత్వం ఆ మేరకు ఆర్డినెన్స్ ఉత్తర్వులు ఇచ్చింది. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ మాసం వరకు సుమారు రూ.86 వేల కోట్ల నిధుల వ్యయానికి వెసులుబాటు కలిగింది. ఏపీలో గత మూడేళ్లుగా వివిధ కారణాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఆర్డినెన్స్ ఇస్తూ వచ్చారు.

మొదట 2019-20 ఆర్థిక సంవత్సరంలో సాధారణ ఎన్నికలు రావడంతో తొలి మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ఆపై పూర్తిస్థాయి బడ్జెట్ తీసుకువచ్చింది. ఆ తర్వాత రెండోసారి 2020-21 ఆర్థిక సంవత్సరంలో కరోనా ప్రభావంతో బడ్జెట్ సమావేశాలు నిర్వహించలేదు. దాంతో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ తప్పలేదు. ఇప్పుడు కూడా స్థానిక ఎన్నికల కారణంగా పూర్తి స్థాయి బడ్జెట్ ఆమోదానికి వీలు కలగకపోవడంతో తొలి మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేశారు. అయితే, జూన్ నెలాఖరు లోపు ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ కు ఆమోదం పొందాల్సి ఉంటుంది.




Vote On Account
Budget
Ordinance
Andhra Pradesh

More Telugu News