Old Woman: 73 ఏళ్ల వయసులో 'వరుడు కావలెను' అంటూ ప్రకటన ఇచ్చిన వృద్ధురాలు
- తోడు కోసం పరితపిస్తున్న కర్ణాటక రిటైర్డ్ టీచర్
- ఒంటరి జీవితం ఆందోళనకరమని వెల్లడి
- తొలి వివాహం విడాకులతో ముగిసిందని వివరణ
- బ్రాహ్మణ వరుడు కావాలంటూ మ్యాట్రిమొనీలో ప్రకటన
పెళ్లి చేసుకోవాలని కోరుకునేవారు మ్యాట్రిమోనియల్ సైట్లలో ప్రకటనలు ఇవ్వడం సాధారణం. అయితే కర్ణాటకకు చెందిన ఓ వృద్ధురాలు 73 ఏళ్ల వయసులో తనకు తోడు కావాలంటూ ప్రకటన ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆమె ఓ రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. మైసూరుకు చెందిన ఆమెకు గతంలో వివాహం జరిగినా, భర్తతో విడాకులు తీసుకుంది. అప్పటినుంచి ఆమె మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఆమెకు పిల్లలు కూడా లేరు. తల్లిదండ్రులు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో ఒంటరిగా జీవిస్తోంది.
అయితే, వార్ధక్యంలో తనకో తోడు అవసరమని ఆ వృద్ధురాలు భావిస్తోంది. ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉందని, బస్టాపు నుంచి ఇంటికి రావాలంటే ఆందోళన కలుగుతుందని, ఇప్పటి పరిస్థితుల్లో ఓ జీవిత భాగస్వామి ఉంటే బాగుంటుందని ఆమె అభిప్రాయపడుతోంది. తనకంటూ సొంత కుటుంబం లేదని, తొలి వివాహం విడాకులకు దారితీసిందని వివరించింది. అందుకే వరుడు కావలెను అంటూ ప్రకటన ఇచ్చానని వెల్లడించింది.
అయితే, తాను బ్రాహ్మణ స్త్రీని కాబట్టి వరుడు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడై ఉండాలని, తనకంటే వయసులో పెద్దవాడై ఉండాలని ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా, ఆ వృద్ధురాలి నిర్ణయాన్ని పెద్ద సంఖ్యలో ప్రజలు స్వాగతిస్తున్నారు. జీవితానికి విలువ ఇస్తూ, వయసు గురించి పట్టించుకోకుండా వివాహం కోసం ప్రకటన హర్షించదగ్గ పరిణామం అని పేర్కొంటున్నారు.