PASSEX: హిందూ మహాసముద్రంలో భారత్, అమెరికా సంయుక్త నౌకా విన్యాసాలు
- 'పాసెక్స్' పేరిట రెండ్రోజుల పాటు విన్యాసాలు
- తూర్పు హిందూ మహాసముద్రంలో మోహరించిన భారత్, అమెరికా నౌకలు
- గతంలో మలబార్ విన్యాసాలు
- ఆ విన్యాసాల స్ఫూర్తిని కొనసాగిస్తున్నామన్న నేవీ ప్రతినిధి
ఇండో-పసిఫిక్ ప్రాంతంతో పాటు హిందూ మహాసముద్రంలో చైనాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో గత కొన్నాళ్లుగా భారత్, అమెరికా సంయుక్త కార్యాచరణ అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో రెండు దేశాలు తూర్పు హిందూ మహాసముద్రంలో సంయుక్తంగా నౌకా విన్యాసాలు చేపట్టాయి. 'పాసెక్స్' విన్యాసాల పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యాచరణ రెండ్రోజుల పాటు సాగనుంది.
భారత్ నేవీ నుంచి శివాలిక్ యుద్ధనౌక, పీ8ఐ గస్తీ విమానం... అమెరికా నేవీ తరఫున యూఎస్ఎస్ థియోడర్ రూజ్ వెల్ట్ విమాన వాహకనౌక, సంబంధిత ఇతర నౌకలు పాల్గొన్నాయి. ఇందులో భారత వాయుసేన విమానాలు కూడా పాక్షికంగా పాల్గొనే అవకాశం కల్పించారు. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ భారత్ లో పర్యటించిన కొన్నిరోజులకే ఈ విన్యాసాలు జరుగుతుండడం బైడెన్ సర్కారు భారత్ తో దృఢమైన సంబంధాలను కోరుకుంటోందనడానికి సంకేతాలు అని చెప్పవచ్చు.
గత నవంబరులో మలబార్ విన్యాసాలు అందించిన ఉత్తేజానికి, అంతర్ కార్యనిర్వాహణ స్ఫూర్తికి కొనసాగింపుగా ఈ తాజా విన్యాసాలు చేపడుతున్నట్టు భారత నేవీ ప్రతినిధి పేర్కొన్నారు.