Arvind Kejriwal: కేజ్రీవాల్ కు ఇక కష్టకాలమే... చట్టంగా మారిన ఢిల్లీ బిల్లు!
- బుధవారం నాడు రాజ్యసభలో ఆమోదం
- బిల్లుపై సంతకం చేసిన రాష్ట్రపతి
- ఎప్పటి నుంచి అమలన్న విషయం హోమ్ శాఖ పరిధిలోకి
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు మరిన్ని అధికారాలు ఇస్తూ, కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద బిల్లు చట్టంగా మారింది. ఢిల్లీలో కేంద్రం ప్రతినిధిగా ఉండే ఎల్జీకి, నగరం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంతో పోలిస్తే మరిన్ని అధికారాలు కల్పించే బిల్లుపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేశారు. ఇక ఈ చట్టం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందన్న విషయాన్ని కేంద్ర హోమ్ శాఖ నిర్ధారించాల్సి వుంది. బుధవారం నాడు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు వాకౌట్ చేయగా రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.
ఈ చట్టం అమలులోకి వస్తే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముందు మరిన్ని కష్టాలు ఉన్నట్టేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2013లో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఢిల్లీ ప్రభుత్వానికి, ఎల్జీకి మధ్య అధికార యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చట్టం ప్రకారం, ఢిల్లీలో ప్రభుత్వం అంటే, లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే. ఏ కార్య నిర్వాహక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవాలన్నా లెఫ్టినెంట్ గవర్నర్ అభిప్రాయమే కీలకం అవుతుంది.
ఈ బిల్లు ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేస్తుందని పలువురు విపక్ష పార్టీలు రెండు రోజుల పాటు రాజ్యసభలో తమ నిరసనలను తెలియజేసినా, ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేసినా, కేంద్రం రాజ్యసభలో తమకున్న బలంతో మూజువాణీ ఓటుతో ఈ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ ఢిల్లీని పాలించాలన్న దుర్మార్గపు ఉద్దేశంతో ఎల్జీని అడ్డుపెట్టుకుందని ఆప్ ప్రభుత్వం తరచూ విమర్శలు గుప్పిస్తోంది.