Athmakur: ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబును కలిసిన ఆత్మకూరు గ్రామస్థులు
- ఆత్మకూరు గ్రామంలో కూల్చివేతలు
- రోడ్డు విస్తరణ పేరిట నివాసాల తొలగింపు
- చంద్రబాబుకు తెలిపిన గ్రామస్థులు
- ఎమ్మెల్యే ఆర్కే తమను పట్టించుకోవడం లేదని ఆరోపణ
- బాధితుల పక్షాన టీడీపీ పోరాడుతుందని చంద్రబాబు హామీ
మంగళగిరి నియోజక వర్గం ఆత్మకూరు గ్రామస్థులు తమ గ్రామంలో కూల్చివేతలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వారు ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తమ సమస్యలు పరిష్కరించడం లేదని వాపోయారు. కూల్చివేతలు వద్దని న్యాయస్థానం చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. ఆర్కే ఆదేశాలతోనే అధికారులు కూల్చివేతలకు సిద్ధమయ్యారని ఆరోపించారు.
ఆత్మకూరు గ్రామస్థుల పరిస్థితిపై చంద్రబాబు స్పందించారు. బాధితుల పక్షాన టీడీపీ పోరాడుతుందని హామీ ఇచ్చారు. విధ్వంసమే లక్ష్యంగా వైసీపీ ముందుకు సాగుతోందని మండిపడ్డారు. ఇటీవల ఆత్మకూరు గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా పలు నివాసాలను అధికారులు కూల్చివేయడం వివాదాస్పదమైంది. 40 ఏళ్లుగా ఉంటున్న తమను రోడ్డున పడేశారంటూ స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.