Tamil Nadu: తమిళనాడులో వ్యాన్, ఆర్టీసీ బస్సు ఢీ.. నలుగురి మృతి, మరో 8 మంది పరిస్థితి విషమం
- మృతుల్లో వ్యాన్ డ్రైవర్, ఇద్దరు మహిళలు
- బస్సు టైరు పేలిపోవడమే ప్రమాదానికి కారణం
- తీవ్రంగా గాయపడిన మరో 60 మంది
తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడగా మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో వ్యాన్ డ్రైవర్ సహా ఇద్దరు మహిళలు ఉన్నారు. బాట్లగుండు-దిండిగల్ జాతీయ రహదారిపై సెవుగంపట్టి పాస్ వద్ద ప్రైవేటు మిల్లు కార్మికులతో వెళ్తున్న వ్యాన్, ఆర్టీసీ బస్సు ఒకదాన్నొకటి బలంగా ఢీకొన్నాయి.
ప్రమాద సమయంలో వ్యాన్‌లో 15 మంది కార్మికులు ఉన్నారు. క్షతగాత్రుల్లో మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వారంతా మధురైలోని ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. మరో 54 మందిని తొలుత బాట్లగుండు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం థేనిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.
వ్యాన్ సింగరకొట్టైలోని మిల్లుకు వెళ్తుండగా, బస్సు థేని నుంచి దిండిగల్ వస్తోందని, బస్సు టైరు పేలిపోవడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.