Hyderabad: తెలంగాణపై నిప్పులు కురిపిస్తున్న భానుడు.. అప్పుడే 43 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు
- మండిపోతున్న ఎండలు
- మరో మూడు రోజులపాటు ఇదే తీరు
- హైదరాబాద్‌లో గరిష్ఠంగా 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు అప్పుడే ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. నిన్న ఈ సీజన్లోనే అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.8 నుంచి 42.7 డిగ్రీలుగా నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఇక, హైదరాబాద్‌లోనూ నిన్న ఎండ మండిపోయింది. ఖైరతాబాద్‌లోని గణాంకభవన్ వద్ద 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సగటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18-25.9 డిగ్రీలుగా నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులపాటు సాధారణం కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అదనంగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.