India: మయన్మార్ శరణార్థులకు అన్నం పెట్టొద్దు, ఆశ్రయం ఇవ్వొద్దు: ప్రజలకు మణిపూర్ ప్రభుత్వం హెచ్చరిక
- కేవలం మానవతా సాయం మాత్రమే చేయాలి
- పలు సరిహద్దు జిల్లాల అధికారులకు ఆదేశాలు
- శరణార్థులను అనుమతించాలంటున్న యూఎన్ మయన్మార్ ప్రతినిధి
మయన్మార్ నుంచి ఆశ్రయం కోరి వచ్చే శరణార్థులకు అన్న పానీయాలు ఇవ్వరాదని, వారికి ఆశ్రయం కల్పించవద్దని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం పౌర సమాజానికి, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం, శరణార్థులు తీవ్రంగా గాయపడి ఉంటే, మానవతా దృక్పథంతో వైద్య సదుపాయాలు మాత్రం కల్పించాలని, ఇది మినహా మరే విధంగానూ సాయం చేయవద్దని ఆదేశించింది.
ముఖ్యంగా సరిహద్దుల్లోని ఛండేల్, తెంగ్ నోపాల్, కామ్ జోంగ్, ఉఖ్రుల్, చురాచాంద్ పూర్ జిల్లాలు ఈ విషయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని, మయన్మార్ దేశస్థులను ఇండియాలోకి చట్టపరంగా అనుమతించే ముందు అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
ఇదిలావుండగా, ఐక్యరాజ్య సమితిలోని మయన్మార్ ప్రతినిధి ఇటీవల మాట్లాడుతూ, తమ దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా, భారత ప్రభుత్వం శరణార్థులను మానవతా దృక్పథంతో ఇండియాలోకి అనుమతించాలని, రెండు దేశాల మధ్యా ఉన్న సుదీర్ఘ చరిత్రను మరువకుండా తమ దేశ వాసులకు సాయం అందించాలని కోరారు.
మయన్మార్ లో సైనిక తిరుగుబాటు ప్రారంభమైన తరువాత, నిరసనలు తెలుపుతున్న ప్రజలపై నిత్యమూ ఎక్కడో ఒకచోట కాల్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా యాంగాన్ లో గత శుక్రవారం జరిగిన నిరసనలపై సైన్యం కాల్పులకు దిగగా, 90 మందికి పైగా మరణించడం, అందులో చాలా మంది చిన్న పిల్లలు ఉండటం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పొరుగు దేశం నుంచి భారీ సంఖ్యలో శరణార్థులు ఇండియాకు వస్తారని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే శరణార్థుల కోసం షెల్టర్స్ ప్రారంభించవద్దని, వారికి ఆహారం కూడా అందించరాదని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇదే సమయంలో ఆధార్ ఎర్ రోల్ మెంట్ కిట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఆధార్ కార్డు దరఖాస్తులు, ఎన్ రోల్ మెంట్ ను తక్షణం నిలిపివేయాలని కూడా బీరేన్ సింగ్ సర్కారు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. అయితే, ప్రభుత్వ ఆదేశాలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్నాయి.