Kala Venkata Rao: మోదీని ప్రశ్నించలేని జగన్ కు ఇప్పుడు మరో ఎంపీ అవసరమా?: కళావెంకట్రావు
- 28 మంది ఎంపీలను ఉంచుకుని సాధించిందేమీ లేదు
- ప్రత్యేక హోదా ఊసే ఎత్తడం లేదు
- కేసుల భయంతో నోరెత్తడం లేదు
28 మంది ఎంపీలను ఉంచుకొని రాష్ట్రానికి ఏమీ సాధించలేని అసమర్థ ముఖ్యమంత్రి జగన్ అని టీడీపీ సీనియర్ నేత కళావెంకట్రావు విమర్శించారు. రెండేళ్ల పాలనలో ఏం సాధించారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇంతమంది ఎంపీలున్నా ఏం చేయలేకపోయిన జగన్ కు... మరో ఎంపీ అవసరమా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతో రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయని ఎన్నికల ముందు చెప్పిన జగన్... ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని చెప్పారు. మరో ఎంపీని గెలిపించాలని కోరే నైతిక హక్కు జగన్ కు లేదని అన్నారు.
కేంద్రం నుంచి రావాల్సిన రూ. 24 వేల కోట్లు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రైల్వేజోన్ వంటి వాటిపై జగన్ కేంద్రాన్ని నిలదీయడం లేదని విమర్శించారు. దుగరాజపట్నం, రామాయపట్నం పోర్టులు, కడప స్టీల్, విశాఖ ఉక్కు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం వచ్చే ముఖ్యమంత్రిని, వైసీపీ నేతలను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. కేసుల భయంతోనే కేంద్రం ముందు జగన్ నోరెత్తడం లేదని... ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని కోరారు.