Raghu Rama Krishna Raju: పవన్ వల్ల వైసీపీకి ప్రమాదమేమో అనే అనుమానం కలుగుతోంది: రఘురామకృష్ణరాజు
- ఆర్థికంగా రాష్ట్రం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది
- రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి దగ్గర్లోనే ఉంది
- మద్యం అమ్మకాలతో ఆదాయం పెంచుకోవాల్సిన దుస్థితి ఉంది
వైసీపీని ఉద్దేశించి ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం పవన్ కల్యాణ్ అంటూ సోము వీర్రాజు ప్రకటించడం చూస్తుంటే... పవన్ వల్ల తమ పార్టీ వైసీపీకి ప్రమాదమేమో అనే అనుమానం కలుగుతోందని అన్నారు.
బడ్జెట్ ను ఆర్డినెన్స్ ద్వారా ప్రవేశపెట్టిన పరిస్థితి దేశంలో ఎప్పుడూ లేదని విమర్శించారు. రాష్ట్ర అప్పులు భారీగా పెరిగిపోయాయని... రానున్న కాలంలో ఆర్థికంగా రాష్ట్రం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటుందని అన్నారు. అయితే, దీని గురించి జగన్ మాట్లాడటమే లేదని చెప్పారు.
మరో నీరో చక్రవర్తిని ఎన్నుకున్నామనే భావనలో ప్రజలు ఉన్నారని రఘురాజు అన్నారు. రుణ ఆంధ్రప్రదేశ్ స్థాయి నుంచి దివాలా ఆంధ్రప్రదేశ్ స్థాయికి రాష్ట్రం మారే పరిస్థితి దగ్గర్లోనే ఉందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల కోసం మద్యంపై ఆదాయాన్ని పెంచుకోవాల్సిన దుస్థితి దాపురించిందని అన్నారు.
తిరుమల వెంకన్నకు భక్తులు సమర్పించిన తలనీలాలు కూడా అమ్మకపోవడం సిగ్గుచేటని రఘురాజు మండిపడ్డారు. ఇన్నిరోజులు ఎర్రచందనాన్ని దొంగిలించారని... ఇప్పుడు తలనీలాలను దొంగిలిస్తున్నారని అన్నారు. వెంకన్న డబ్బులు దొంగిలించిన వారు బాగుపడినట్టు చరిత్రలో లేదని చెప్పారు. వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఇన్ని రోజులైనా ఛేదించకపోవడం దారుణమని అన్నారు.