India: దేశంలో కరోనా పరిస్థితి తీవ్రంగా ఉంది.. యావత్ దేశం ప్రమాదంలో పడుతోంది: కేంద్ర ఆరోగ్యశాఖ
- అనతికాలంలోనే కేసుల సంఖ్య ఐదు రెట్లు పెరిగింది
- రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి
- యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్న 10 జిల్లాల్లో 8 మహారాష్ట్రలోనే ఉన్నాయి
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం చేస్తోంది. అనతికాలంలోనే కేసుల సంఖ్య ఐదు రెట్లు పెరిగిందని... పరిస్థితి తీవ్రంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించింది. నోరు, ముక్కుపై మాస్క్ ఎప్పుడూ ఉండాలని తెలిపింది. పరిస్థితులు మరింత దిగజారకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. యావత్ దేశం ప్రమాదంలో పడుతోందని తెలిపింది. కరోనాను కట్టడి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య మళ్లీ 5 లక్షలు దాటిందని చెప్పింది. ప్రస్తుతం 5,40,720 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది.
దేశంలో 10 జిల్లాల్లో అత్యధిక యాక్టివ్ కేసులు ఉండగా... వీటిలో 8 జిల్లాలు మహారాష్ట్రలోనే ఉన్నాయని వెల్లడించింది. ఈ జాబితాలో పూణె అగ్రస్థానంలో ఉండగా... ఆ తర్వాతి స్థానాల్లో ముంబై, నాగపూర్, థానె, నాసిక్, ఔరంగాబాద్, బెంగళూరు అర్బన్, నాందేడ్, ఢిల్లీ, అహ్మద్ నగర్ ఉన్నాయి. పంజాబ్ లో కేసులు పెరగడానికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని తెలిపింది.