udayanidhi: అందుకే అద్వానీ, వెంకయ్య, యశ్వంత్ సిన్హాను మోదీ పక్కనబెట్టారు: ఉదయనిధి
- ప్రధాని అయ్యేందుకు బీజేపీలోని సీనియర్లను పక్కనబెట్టారు
- ఇప్పుడు ఎల్‌కే అద్వానీ ఎక్కడ ఉన్నారు?
- మోదీ వేధింపులు భరించలేకే యశ్వంత్ సిన్హా బీజేపీని వీడారు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కి టికెట్ దక్కిన విషయం తెలిసిందే. తండ్రి వల్లే ఆయనకు టికెట్ వచ్చిందని, పార్టీలోని సీనియర్లను పట్టించుకోకుండా వారిని పక్కనబెట్టి కొడుక్కి టికెట్ ఇచ్చారని నిన్న ప్రధాని మోదీ చేసిన విమర్శలను ఉదయనిధి తిప్పికొట్టారు.
ప్రధాని అయ్యేందుకు మోదీ బీజేపీలోని చాలా మంది సీనియర్లను పక్కనబెట్టారని ఉదయనిధి విమర్శించారు. బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ ఎక్కడ? అని ఆయన ప్రశ్నించారు. ఎల్‌కే అద్వానీకి ప్రధాని అయ్యే అర్హత ఉన్నందుకే ఆయనను మోదీ దూరం పెట్టారని విమర్శించారు.
ఇప్పుడు అద్వానీ ఎక్కడ ఉన్నారని ఆయన అడిగారు. చివరకు మోదీ వేధింపులు భరించలేకే యశ్వంత్ సిన్హా బీజేపీని వీడారని ఆయన చెప్పారు. అంతేగాక, తన పదవికి ఎలాంటి ప్రమాదం రాకూడదనే ఉద్దేశంతోనే వెంకయ్యనాయుడిని కూడా మోదీ పక్కనపెట్టారని ఆయన ఆరోపించారు. తాను మోదీ ముందు తమిళనాడు సీఎం పళనిస్వామిలా మోకరిల్లబోనని చెప్పుకొచ్చారు.