Mukesh Ambani: అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాల కారును పెట్టింది వాజే కాదట!
- వాజే డ్రైవరే కారును పార్క్ చేశాడన్న ఎన్ఐఏ
- అతడి వెనకాలే ఎస్కార్ట్ గా ఇన్నోవాలో వాజే
- బెదిరింపు లేఖ పెట్టింది వాజేనే
- సాక్ష్యాధారాలను లేకుండా చేసేందుకు సీసీటీవీ ఫుటేజీల ధ్వంసం
భారత కుబేరుడు ముకేశ్ అంబానీ ఇల్లు యాంటీలియా ముందు పేలుడు పదార్థాలున్న కారును పెట్టిన కేసులో ఇది మరో ట్విస్ట్. ఇప్పటిదాకా కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పోలీస్ అధికారి సచిన్ వాజే చుట్టూ ఉచ్చును బిగించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ).. తాజాగా ఆ కారును అక్కడ పెట్టింది సచిన్ వాజే కాదని తేల్చింది.
వాజే డ్రైవర్ ఆ కారును తీసుకెళ్లి యాంటీలియా ముందు పెట్టాడని వెల్లడించింది. పేలుడు పదార్థాలున్న స్కార్పియో కారును వాజే డ్రైవర్ నడుపుకుంటూ వెళ్లగా.. దాని వెనుకే తెల్లటి ఇన్నోవా కారులో వాజే అనుసరించారని పేర్కొంది.
ములుంద్ ఐరోలి రోడ్ లో తన స్కార్పియోను పార్క్ చేశానని, దానిని ఎవరో దొంగిలించారని హత్యకు గురైన ఆ కారు యజమాని మన్సుఖ్ హిరెన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, సచిన్ వాజే ఆదేశాలతో డ్రైవర్ ఆ కారును తీసుకొచ్చి వాజే ఇంటి ముందు పెట్టారని ఎన్ఐఏ దర్యాప్తులో పేర్కొంది.
ఆ తర్వాత ఫిబ్రవరి 19న హెడ్ క్వార్టర్స్ కు, మర్నాడు మళ్లీ వాజే నివాసముంటున్న సొసైటీకి తీసుకెళ్లాడని తెలిపింది. ఫిబ్రవరి 24 వరకు అక్కడే ఉన్న కారును.. ఫిబ్రవరి 25న యాంటీలియా ముందు డ్రైవర్ పార్క్ చేశాడని వెల్లడించింది. పోలీసులు కారును అడ్డుకోకూడదన్న ఉద్దేశంతోనే ఆ స్కార్పియోను సచిన్ వాజే అనుసరించినట్టు తెలుస్తోంది.
కారును ఫిబ్రవరి 25న రాత్రి 10 గంటలకు పార్క్ చేసిన తర్వాత.. డ్రైవర్ ఆ కారు దిగి వాజే వచ్చిన ఇన్నోవాలో ఎక్కాడని పేర్కొంది. ఆ తర్వాత ఇన్నోవాలో నుంచి తెల్లటి కుర్తా వేసుకున్న వాజే దిగారని, నేరుగా బాంబులు పెట్టిన కారు దగ్గరకు వెళ్లి బెదిరింపు లేఖను వదిలేసి వచ్చారని తెలిపింది. ఆధారాలను లేకుండా చేసేందుకు హెడ్ క్వార్టర్స్ లోని రెండు డీవీఆర్లు, సాకేత్ సొసైటీలోని ఒక డీవీఆర్ (సీసీటీవీ ఫుటేజీ)ను వాజే నాశనం చేశారని పేర్కొంది.