Employees: తమను రిలీవ్ చేయాలంటూ సీఎం జగన్ ను కలిసిన తెలంగాణ ప్రాంత ఉద్యోగుల ప్రతినిధులు

Employees belongs to Telangana met AP CM Jagan

  • ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు
  • తమ కుటుంబాలు తెలంగాణలో ఉన్నాయని జగన్ కు వినతి
  • తమను సొంత రాష్ట్రానికి పంపాలని విజ్ఞప్తి
  • సానుకూలంగా స్పందించిన సీఎం జగన్
  • ఫైలును వెంటనే పరిష్కరించాలని ఆదేశం 

రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రాంతానికి చెందినవారు కొందరు ఏపీ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారు తమ స్వరాష్ట్రం తెలంగాణకు వెళ్లాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ ఉద్యోగుల ప్రతినిధులు ఏపీ సీఎం జగన్ ను కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎంను కలిసిన తెలంగాణ ఉద్యోగుల ప్రతినిధులు... తెలంగాణలో తమ సర్వీసు కొనసాగించేందుకు రిలీవ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబాలు తెలంగాణలో ఉన్నాయని వివరించారు.

ఉద్యోగ ప్రతినిధుల వినతిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. ఏపీలో విధుల్లో ఉన్న 711 మంది తెలంగాణ ప్రాంతానికి చెందినవారిని రిలీవ్ చేసేందుకు అంగీకరించారు. ఈ సందర్భంగా, సొంత రాష్ట్రానికి వెళుతున్న ఆ ఉద్యోగులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. జగన్ నిర్ణయం పట్ల ఉద్యోగుల ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.

ఆమధ్య కేసీఆర్, జగన్ ల మధ్య జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రాంత ఉద్యోగుల అంశం చర్చకు వచ్చింది. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ సంబంధిత ఫైలును తెలంగాణ నుంచి ఏపీ ప్రభుత్వానికి పంపారు. తాజాగా తెలంగాణ ప్రాంత ఉద్యోగులు తనను కలిసిన నేపథ్యంలో, ఆ ఫైలును వెంటనే పరిష్కరించాలంటూ జగన్ ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News