Srinidhi: కాంగ్రెస్ ఎంపీ భార్య పాటను ఎన్నికల ప్రచారంలో తెలివిగా ఉపయోగించుకుంటున్న తమిళనాడు బీజేపీ!
- తమిళనాడులో ఏప్రిల్ 6న ఎన్నికలు
- వాడీవేడిగా ప్రచారం
- పదేళ్ల కిందట ఓ నాట్య ప్రదర్శన ఇచ్చిన శ్రీనిధి
- శ్రీనిధి కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం భార్య
- అందులో తామర పువ్వు స్లోగన్ బీజేపీని ఆకర్షించిన వైనం
తమిళనాడులో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే... కాంగ్రెస్ పార్టీ నేత, శివగంగ ఎంపీ కార్తి చిదంబరం భార్య శ్రీనిధిపై చిత్రీకరించిన ఓ డ్యాన్స్ వీడియోను ఈ ఎన్నికల్లో బీజేపీ వినియోగిస్తోంది. "తామరై మలరట్టుమ్... తమిళగం వలరట్టుమ్" (కమలాన్ని వికసింప చేద్దాం, తమిళనాడును ఎదగనిద్దాం) అంటూ సాగే ఈ పాట నిడివి 5.16 నిమిషాలు.
ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి అయిన శ్రీనిధి పదేళ్ల కిందట వరల్డ్ క్లాసికల్ తమిళ్ కాన్ఫరెన్స్ లో నాట్య ప్రదర్శన ఇచ్చారు. ఆ నాటి వీడియోనే బీజేపీ ఇప్పుడు తన ప్రచారంలో భాగం చేసింది. ఆ పాటనే బీజేపీ ఎంచుకోవడానికి బలమైన కారణం ఉంది. బీజేపీ గుర్తు కమలం అన్న సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా మరో పాట ఎందుకనుకున్న తమిళనాడు బీజేపీ నేతలు... తమ తామర పువ్వు స్లోగన్ తో ఉన్న పాట కావడంతో ఎంచక్కా ప్రచారంలో హోరెత్తిస్తున్నారు.
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ పాటను రాసింది తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కాగా, స్వరమాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. రెండ్రోజుల కిందటే ఈ వీడియోను బీజేపీ విడుదల చేసింది.
దీనిపై దీనిపై ఎంపీ కార్తీ చిదంబరం అర్ధాంగి శ్రీనిధి స్పందించారు. ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ తన వీడియోను ఉపయోగిస్తుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండడంతో ఈ వీడియోను బీజేపీ తొలగించినట్టు తెలుస్తోంది.