USA: హెచ్1బీ వీసా జారీ ప్రక్రియలో కీలక అడుగు!
- 2022 ఆర్థిక సంవత్సరానికిగానూ వీసాల జారీ
- ప్రాథమిక ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ఎంపిక ప్రక్రియ పూర్తి
- దరఖాస్తులను పరిశీలించి లాటరీ విధానంలో ఎంపిక
- 2021, డిసెంబరు 31 వరకు లాటరీ విధానంలోనే
అమెరికాలో భారీగా డిమాండ్ ఉండే హెచ్-1బీ వీసా జారీ ప్రక్రియలో కీలక అడుగు పడింది. 2022 ఆర్థిక సంవత్సరంలో హెచ్1బీ వీసాల జారీకి సంబంధించి ప్రాథమిక ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ఎంపిక ప్రక్రియను అమెరికా పూర్తి చేసింది. సరైన ఆధారాలతో సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి లాటరీ విధానంలో ఎంపిక చేయనున్నట్లు ‘అమెరికా పౌరసత్వం వలసదారుల కేంద్రం (యూఎస్ సీఐఎస్)’ పేర్కొంది.
అమెరికా కంపెనీల్లో పనిచేయాలంటే విదేశీ వృత్తి నిపుణులకు హెచ్1బీ వీసా తప్పనిసరి. కాగా వీటికి భారత్ సహా పలు దేశాల నుంచి గట్టి పోటీ ఉంది. ఏటా 65 వేల హెచ్1బీ వీసాలను జారీ చేసేందుకు పరిమితి ఉంది. అమెరికాలో అడ్వాన్స్డ్ డిగ్రీ చేసిన వారికి మరో 20 వేల వీసాలు జారీ చేస్తారు. 2021, డిసెంబరు 31 వరకు లాటరీ విధానంలో వీసాల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.